ఆంధ్రా ప్యారిస్‌ అందరిదీ అదేమాట

Sakshi Ground Report On Tenali Constituency

సాక్షి, అమరావతి : రాజకీయ చైతన్య వీచిక తెనాలి మార్పును ఆకాంక్షిస్తోంది. గత ఐదేళ్ల పాలన చేదు అనుభవాలను నెమరవేసేవారు కొందరైతే.. గ్రాఫిక్స్, ఇంద్రజాలం తప్ప అభివృద్ధి, సంక్షేమం కరువైన దైన్య స్థితిని గుర్తుచేస్తున్నవారు మరికొందరు. మాయామాటలతో మూలన పడేసిన హామీలకు కొత్త రంగు పులిమి అనుభవం ఉన్న నేతనంటూ కాళ్ల బేరానికొచ్చినా నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.

ఓటుకు నోట్లిచ్చినా... గుడ్డిగా అనుకరించేవాళ్లు్ల కనిపించడం లేదు. హక్కును అమ్ముకునే అవసరమేంటనేది స్థానికుల ప్రశ్న. ప్రతి ఇంటికి నవరత్నాలు చేరితే ఏటా రూ.లక్షల ప్రయోజనం ఉంటుందంటూ వారంతా చెబుతున్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో ‘సాక్షి’ బృందం జరిపిన రోడ్‌ షోలో ప్రజాభిప్రాయం వెల్లడైంది. 

నేతల నామినేషన్లతో తెనాలిలో పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. సాగునీటి శాఖ కార్యాలయం దాటి కాస్త ముందుకెళ్తే శీతల పానీయాలు ఆస్వాదిస్తూ కొందరు చర్చించుకుంటున్నారు. వారి ప్రధాన టాపిక్‌ వైఎస్సార్‌ సీపీ నవరత్నాలే. ‘చంద్రబాబు పథకాలెక్కడా? జగన్‌ నవరత్నాలెక్కడా? ఎన్నికల ముందు అదిగో ఇదిగో అంటూ చంద్రబాబు మాయ చేస్తున్నాడు. అర్థం కావట్లేదా?’ అనే హబీబుల్లా మాటలతో చర్చ కాస్త సీరియస్‌గా మారింది. ‘ఐదేళ్ల క్రితం అందరినీ నమ్మించాడు. ఇప్పుడూ అదే చేయాలనుకుంటున్నాడు.

ఈసారి గ్రాఫిక్స్‌తో ముందుకొస్తున్నాడు. ప్రజలు దీన్ని గుర్తించాలి’ విశ్వనాథ్‌ మాటల్లో ఆవేశం కన్పించింది. ‘చదువుకున్నాళ్లే జనాన్ని చైతన్యం చెయ్యాలి’ ఆ పక్కనే చెరుకు రసం గ్లాస్‌ చేతుల్లోకి తీసుకున్న రమణ అన్నాడు. నవరత్నాల్లో లేని అంశమే లేదు. రైతులు, విద్యార్థులు, పేదలు, ఆరోగ్య శ్రీ ఒకటేంటి అన్నీ అందరికీ ఉపయోగపడేవే. జనంలోకి తీసుకెళ్లాలి’ అన్నాడు కొత్తగా ఓటొచ్చిన మల్లికార్జున ప్రసాద్‌. అక్కడకు వచ్చేవాళ్లు వస్తున్నారు... పొయ్యేవాళ్లు పోతున్నారు. చర్చ కొనసాగుతూనే ఉంది.

ఐదేళ్ల మోసానికి ఓటే దీటైన జవాబు
తెనాలి మండలం కొలకలూరులో ప్రజలను కదిలిస్తే చాలు మండిపడుతున్నారు. ఈ ఐదేళ్లు మోసపోయామన్న ఆవేదన వాళ్లలో కన్పిస్తోంది. తోటి మహిళలతో కోసూరు స్వప్న సాగించిన సంభాషణలో ఆ వాడివేడి తెలిసింది. ఒక్క నిమిషం అక్కడ ఆగితే... స్వప్నతో మరికొందరు మహిళలు గొంతు కలిపారు. ‘తెలుగు దేశపాయన నిన్న మా ఇంటికి వచ్చిండు వదినా.. వాళ్లంట పథకాలిత్తనారట. ఏదీ ఒక్కటైనా వచ్చిందా? సిగ్గు లేకుండా చెప్పుకొంటున్నారు.

ఏం జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తేంటి?’ అంటూ ఈశ్వరమ్మ స్వరం కాస్త గట్టిగానే పలికింది. ‘ఔను మా ఇంటికీ వచ్చారు. డబ్బులిస్తామన్నారు. ఏం చూసి ఓటేయాలని మా పిల్లలు అడిగితే సమాధానం లేదు’ రుక్మిణమ్మ తన ఇంట్లో విషయాలు చెప్పుకొచ్చింది. స్వప్న కాస్త అడ్వాన్స్‌డ్‌గా తన అభిప్రాయం బయటపెట్టింది. సుపరిపాలన ఇచ్చే వాళ్లకే ఓటెయ్యాలంది. 

జగన్‌ ఉండబట్టే ఆ పథకాలు...
సమయం సాయంత్రం నాలుగవుతోంది. కొల్లిపర మండలం అత్తోట మెయిన్‌ రోడ్డులో ఓ తోపుడు బండి. వృద్ధులంతా చెట్టు కింద పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. తోపుడు బండి మీద వేడివేడి ఇడ్లీలు తినేవరకు రోజూ ఆ చర్చ ఇలాగే సాగుతుందట. ‘ఇదేంటి ఈ టైంలో టిఫినా...?’ అంటే అదంతే అన్నారు. ‘జగన్‌ నవరత్నాలు ప్రకటించాకే కదా చంద్రబాబు పథకాలు నెత్తికెత్తుకున్నాడు’ అని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు గనిపిశెట్టి సాంబశివరావు.

‘జగన్‌ ఉండబట్టే ఈ ఐదేళ్లు చంద్రబాబు కాస్త వళ్లు దగ్గరపెట్టుకున్నాడు. జగన్‌ అంటే ఏంటో జనానికి తెలిసింది. మార్పు కోరుకుంటున్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. జనసేన కుల ప్రభావాన్ని నమ్ముకుంది’ అన్నాడు రామశేఖరయ్య. ‘ఇడ్లీ రెడీ’ అని తోపుడు బండి అతను చెప్పేవరకు ఆ చర్చ రాజకీయాల చుట్టూ సాగుతూనే ఉంది. ఇవే కాదు... చెట్ల దగ్గర, చేలల్లో... రచ్చబండల వద్ద ఇలాంటి మాటామంతీలే! 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top