
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జనరంజకమైన సంక్షేమ పథకాలు అందిస్తోందని, వీటిని సక్రమంగా అమలు జరిగేలా చూడడం ప్రజాప్రతినిధుల విధి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ క్రమంలో సమస్యలేమైనా ఉంటే వారు అధికారులకు తెలియజేయడమనేది సహజంగా జరిగే ప్రక్రియ అని పేర్కొన్నారు. సందర్భానుసారంగా అవసరమైతే అధికారులను ప్రజల పక్షాన నిలదీస్తారని చెప్పారు. దీన్నే అసంతృప్తిగా భావించి టీడీపీ, దాని ఎల్లో మీడియా భూతద్దంలో చూస్తూ శునకానందం పొందే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
ఆదివారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను 90 శాతం నెరవేర్చటంతో పాటు చెప్పనవి కూడా అమలు చేశారని గుర్తు చేశారు. దేశంలోనే ఆన్‌లైన్ విధానంలో ఇసుకను సులభంగా వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు ఉందన్నారు. కొత్త విధానం ద్వారా ఇసుకను అందిస్తున్న క్రమంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేయనున్న నేపథ్యంలో సోమవారం మొబైల్ యూనిట్ల ట్రయల్‌రన్ చేయనున్నారని పేర్కొన్నారు.