నా కుమారుడి ఓటమికి అతనే బాధ్యత వహించాలి

Sachin Pilot Take Responsibility For Vaibhavs Defeat Says Ashok Gehlot - Sakshi

సచిన్‌ పైలట్‌పై రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ వ్యాఖ్య

జైపూర్‌: తన కుమారుడి ఓటమికి పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌యే బాధ్యత వహించాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ అన్నారు. తన కుమారుడి ఓటమి ఎంతో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందిన జోద్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెహ్లోత్‌ కుమారుడు వైభవ్‌ పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ అభ్యర్థి కేంద్రమంత్రి గజేంద్ర సింద్‌ షెకావత్‌ చేతిలో ఆయన దారుణ ఓటమిని చవిచూశారు. గతంలో ఇక్కడి నుంచి గెహ్లోత్‌ ఐదుసార్లు ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా వీచిన మోదీ గాలి రాజస్తాన్‌లోనూ ప్రభావం చూపింది. ఆరు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఘోర పరాభావం చవిచూసింది. మొత్తం 25 స్థానాలను కమళం కైవసం చేసుకుంది. తన కుమారుడికి మద్దతుగా.. సీఎం జోద్‌పూర్‌పై ప్రత్యేక దృష్టి సాధించినప్పటికీ విజయాన్ని మాత్రం అందించలేక పోయారు.

అయితే వైభవ్‌ ఓటమికి సచిన్‌ ఫైలెట్‌యే కారణమని ఆయన వర్గీలు ఆరోపిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా సచిన్‌ పనిచేశారని, వైభవ్‌ తనకు పోటీగా ఎదుగుతారనే దురుద్దేశ్యంతో  పావులుకదిపారని గుసగుసలాడుతున్నారు. ఈ నేపథ్యంలో వైభవ్‌ ఓటమికి సచిన్‌యే బాధ్యత వహించాలని సీఎం డిమాండ్‌ చేశారు. జోద్‌పూర్‌లో తమ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని సచిన్‌ తమను నమ్మించారని.. కానీ ఫలితాలు మాత్రం దానికి అనుకూలంగా రాలేదని వాపోయారు. కాగా అశోక్‌ కేవలం తన కుమారిడి గెలుపు కోసమే ఆతృతపడ్డారని.. పార్టీ విజయానికి ఏమాత్రం కృషి చేయాలేదని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయంతెలిసిందే. కాగా రాష్ట్రంలో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేయాలని ఆపార్టీ భావిస్తోంది. కాగా అశోక్‌ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top