యుద్ధానికి సన్నద్ధమంటే ఎవరి మీద?

Row erupts as RSS chief Bhagwat Comment on Army - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : యుద్ధానికి సన్నద్ధం కావాలంటే భారత సైన్యానికి ఆరు నెలలు పడుతుందని, అదే తమ ఆరెస్సెస్‌ కార్యకర్తలకైతే మూడు రోజులు పడుతుందని ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెల్సిందే. మోహన్‌ భాగవత్‌ భారత సైన్యాన్ని అవమానించారని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. అయితే అసలు యుద్ధానికి సన్నద్ధం కావడానికి ఆరెస్సెస్‌ ఏమిటీ? అది భారత సైన్యంలో భాగమా? అదో సాంస్కృత సంస్థ.

అలాంటి సంస్థకు యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది ? ఎవరి మీద యుద్ధం చేస్తుంది? ఎవరూ మీదయినా యుద్ధం చేయాల్సిందే భారత సైన్యమే. అందుకు అవసరమైతే ఆదేశాలు జారీ చేయాల్సింది కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన భారత ప్రభుత్వమే. మోహన్‌ భాగవత్‌ తన మాటల ద్వారా పరోక్షంగా యుద్ధానికి ఆరెస్సెస్‌ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నట్లుంది. అయితే ఎవరి మీద ? పాకిస్థాన్‌ మీదనా? పాకిస్థాన్‌ సైన్యానికి ఎదుర్కొనే శక్తి లేదు. పైగా అది భారత సైన్యానికి సంబంధించిన అంశం. ఇకపోతే దేశంలోని ముస్లింలపై యుద్ధమా? దేశంలోని ముస్లింలపై జరిపే దాడులను యుద్ధం అనలేం. హింస అని అంటాం. ఇప్పటికే ఆరెస్సెస్‌ కార్యకర్తల్లో కావాల్సినంత హింస దాగి ఉంది. అలాంటి హింసను మరీ రెచ్చగొట్టడం ఏమిటీ?

ఇప్పటికే దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తమకుతాము సైన్యంగా చెప్పుకునే దళాలు పెరిగిపోయాయి. భజరంగ్‌ దళ్‌ సైనిక శిబిరాల్లాంటివి ఏర్పాటు చేసుకొని వాటిలో ఆయుధ శిక్షణ తీసుకుంటుండగా, గోరక్ష దళాలు లైసెన్స్‌లేని తుపాకులను పట్టుకొని దేశంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. కొన్ని చోట్ల దాడులకు కూడా దిగుతున్నాయి. శివసేన ఆర్మీ ఆఫ్‌ శివాజీ అని చెప్పుకుంటోంది. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఏర్పాటు చేసిన ‘హిందూ యువ వాహిణి’ని ఇప్పుడు ‘హిందూ యూత్‌ ఆర్మీ’ అని చెప్పుకుంటోంది. తమపై జరుగుతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని ఉత్తరప్రదేశ్‌లోని దళితులు భీమ్‌ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి సన్నద్ధం అంటే వివిధ మితవాద సంస్థల్లో పేరుకుపోయిన హింసాత్మక ధోరణులను రెచ్చగొట్టడమే. ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top