హైదరాబాద్‌లో రోహింగ్యా ముస్లిం ఓటర్లు 

Rohingya Muslim voters in Hyderabad - Sakshi

సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ 

దర్యాప్తు జరిపించాలని సీఈసీకి ఫిర్యాదు 

న్యూఢిల్లీ: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ ఓటర్ల జాబితాలో భారీగా రోహింగ్యా ముస్లింల పేర్లు ఉన్నాయని బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. హైదరాబాద్‌ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోహింగ్యా ముస్లింలను ఓటర్లుగా నమోదు చేశారని పేర్కొంది. టీఆర్‌ఎస్, ఏఐఎంఐఎం, కాంగ్రెస్‌ల ఉమ్మడి కుట్రలో భాగంగానే ఇది జరిగిం దని తెలిపింది. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌(సీఈసీ) దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేసింది.

కేంద్ర సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ అరుణ్‌ సింగ్, పార్టీ జాతీయ మీడియా హెడ్‌ అనీల్‌ బాలుని బుధవారం ఈ మేరకు సీఈసీ ఉన్నతాధికారులని కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం నఖ్వీ మాట్లాడుతూ.. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు రోహింగ్యా ముస్లింలు భారత పౌరులు కాదని, అయినా వారు తెలంగాణలో ఓటర్లుగా నమోదై ఉన్నారని తెలిపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేలోపే ఈ కుట్రను ఛేదించి ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని, అధికార పార్టీ ఒకే ఇంటిలో 700 బోగస్‌ ఓటర్లను చేర్చిన విషయాన్నీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top