సత్రం భోజనం.. పెద్దారెడ్డి రికమండేషన్

Revanth Reddy demand white paper on electricity agreements - Sakshi

టీఆర్‌ఎస్‌ సర్కారుపై రేవంత్‌ విసుర్లు

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఒప్పందాల ముసుగులో టీఆర్ఎస్‌ సర్కారు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దివాళా తీసిన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ప్రభుత్వం అక్రమాలకు తెర తీసిందని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ చేసుకున్న ఒప్పందాల్లో అత్యంత అవినీతి దాగుందన్నారు. విద్యుత్‌ ఒప్పందాలు, కొనుగోళ్లపై శ్వేతపత్ర విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

‘డిస్ట్రిబ్యూషన్‌లకు ఐఏఎస్‌లను కాకుండా, కేసీఆర్ సన్నిహితులను నియమించుకున్నారు. విద్యుత్ కొనుగోళ్లు, సరఫరాపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అబద్దాలు చెబుతున్నారు. విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై ఆయనతో చర్చకు కాంగ్రెస్ సిద్ధం. గోల్‌మాల్ ఒప్పందాలతో ఒక సంస్థకు ప్రభుత్వం రూ. 957 కోట్లు చెల్లించింది నిజం కాదా? కేసీఆర్ మాట విననందుకే ఐఏఎస్‌లు సురేష్ చంద్ర, అరవింద్ కుమార్‌లను తప్పించింది వాస్తవం కాదా? ప్రభుత్వం ఐఏఎస్‌ల స్థానంలో అర్హతలేని అధికారులను నియమించడం ద్వారా తెలంగాణకు వచ్చిన లాభం ఏంటో కేసీఆర్ చెప్పాలి. ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలన్నీ గోల్‌మాల్ ఒప్పందాలే. నాడు కాంగ్రెస్ ముందుచూపు నిర్ణయాలతోనే దేశవ్యాప్తంగా నేడు మిగులు విద్యుత్ సాధ్యమైంది. విద్యుత్ మిగులు, సరఫరాలో కేసీఆర్ సాధించింది శూన్యం. ఏపీలో అదనపు విద్యుత్ తక్కువ ధరకు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం ఎందుకు కొనడం లేదు? తెలంగాణలో విద్యుత్ సరఫరా చూస్తుంటే.. సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ అన్నట్లుంద’ని రేవంత్‌ ఎద్దేవా చేశారు.

నీ బతుకెంటో తెలుసుకో..
కాంగ్రెస్ పార్టీని తిడుతున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ముందు తన బతుకేంటో తెలుసుకోవాలన్నారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ప్రశంసించారంటే తాము నమ్మలేమన్నారు. గతంలో నకిలీ అవార్డులు తీసున్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వంకు ఉందని ఆరోపించారు.

ఉత్తమ్‌కు అభినందనలు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రెండోసారి ఎంపికైన ఉత్తమ్‌కుమార్ రెడ్డికి రేవంత్‌ అభినందనలు తెలిపారు. ఆయన నాయకత్వంలో ముందుకు సాగుతామని వ్యాఖ్యానించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top