సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌

revanth reddy challenge to cm kcr - Sakshi

కాంగ్రెస్‌ ఆత్మీయ సమ్మేళనం’లో రేవంత్‌రెడ్డి మాటల తూటాలు

కోస్గిలో మీటింగ్‌ పెడితే ఎవరి సత్తా ఏమిటో తేలుతుంది..

కొడంగల్‌ అభివృద్ధిపై ప్రభుత్వం వివక్ష

మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డిని సైతం ఓడిస్తానంటూ శపథం

రేవంత్‌తో పాటు నన్ను ఒకే స్టేజీపై చూడాలన్న కోరికతో సమావేశానికి కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. నాకు, రేవంత్‌ నడుమ ఇప్పటిదాకా సిద్ధాంతపరమైన విబేధాలే తప్ప వ్యక్తిగతవైరం ఏనాడూ లేదు. – డీకే.అరుణ 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కాంగ్రెస్‌ పార్టీలో ఇటీవలి కాలంలో చేరిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్‌పై మాటల తూటాలు పేల్చారు. దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా తనతో తలపడాలని సవాల్‌ విసిరారు. ఎవరేమిటో తేలాలంటే తనపై పోటీకి దిగాలన్నారు. అంతేకాదు కేసీఆర్‌ కుటుంబానికి దమ్ము, ధైర్యం ఉంటే కోస్గి చౌరస్తాలో మీటింగ్‌ పెడితే ఎవరి సత్తా ఏంటో తేలుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని కోస్గి పట్టణంలో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆధ్వర్యాన ‘కాంగ్రెస్‌ ఆత్మీయ సమ్మేళనం’ పేరిట సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేత, ఎమ్మెల్యే డీకే అరుణ, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జి డోకూరి పవన్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు.

మళ్లీ జెండా ఎగురవేస్తాం..
కాంగ్రెస్‌ ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కొడంగల్‌ నియోజకవర్గంలోని గురున్నాథరెడ్డి గడీ మీద రెండు సార్లు జెండా ఎగురేసిన మాదిరిగానే.. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ గడీ మీద జెండా ఎగురేస్తానన్నారు. అంతేకాదు పాలమూరు ప్రాంత మంత్రులు జూపల్లి కృష్ణా రావు, లక్ష్మారెడ్డితో పాటు మరో మంత్రి మహేందర్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానని శపథం చేశారు. కొడంగల్‌లో తనపై పోటీ చేయడం కోసం ఇక్కడున్న గురున్నాథరెడ్డి వల్ల కావడం లేదని తాండూరు బుడ్డరఖాన్‌లను దింపేందుకు చూస్తున్నారన్నారు. వాళ్లు తాండూరులో ఏం వెలగబెట్టారని ఇక్కడకొస్తారని ప్రశ్నించారు. అంత పోటుగాళ్లయితే తాండూరులో ఆయూబ్‌ఖాన్‌ అనే కార్యకర్త పెట్రోల్‌ పోసుకొని ఎందుకు చనిపోవాల్సి వస్తుందని ప్రశ్నించారు.

నియోజకవర్గ అభివృద్ధిపై వివక్ష
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తనపై ఉన్న కోపంతో కొడంగల్‌ నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని రేవంత్‌ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు రూ.300 కోట్లతో కొడంగల్‌లో రోడ్లు వేయించానన్నారు. మరో రూ.350 కోట్లతో కోయిల్‌సాగర్‌ నుంచి కొడంగల్‌ వరకు రూ.250 కోట్లతో తాగునీటి పథకాన్ని మంజూరు చేయించామన్నారు. అందులో రూ.60 కోట్ల ఖర్చుతో కొంత మేర పనులు కూడా జరిగాయన్నారు. ఆరు నెలల్లో పూర్తికావాల్సిన పనులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక 40 నెలలు కావొస్తున్న పూర్తి కావడం లేదన్నారు. నారాయణపేట–కొడంగల్‌ లిఫ్టు ఇరిగేషన్‌కు పూర్తిగా గండి కొట్టారన్నారు.

స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి ఆలోచనల మేరకు భీమా–2 ద్వారా ఇక్కడి ప్రాంతానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని తాను శతవిధాల ప్రయత్నించానన్నారు. అందుకు అనుగుణంగా కాంగ్రెస్‌ హయాంలో జీఓ 69 విడుదల చేసి రూ.1500 కోట్లు కేటాయించిందన్నారు. ఇక్కడి రైతులు బాగుపడితే రేవంత్‌కు మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితో దాన్ని అట్టకెక్కించారని ఆయన విమర్శించారు. కొడంగల్‌ ప్రజల చిరకాల కోరిక రైల్వేలైన్‌కు కూడా అడుగడునా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. తాను కేంద్రంతో మాట్లాడి రూ.750 కోట్లు మంజూరు చేయించినా, సీఎం కేసీఆర్‌ ఫైలును తన ముడ్డి కింద పెట్టుకుని పనులు జరగనివ్వడం లేదని ఆరోపించారు. ఇంకా సిమెంట్‌ ఫ్యాక్టరీ, కోస్గి బస్‌స్టేషన్‌ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకుంటున్నరని ఆరోపించారు. 

ప్రతీ గ్రామంలో తిరుగుతా..
రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో పర్యటిస్తానని రేవంత్‌ వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, టీడీపీ నుంచి వచ్చిన వారి నుంచి ఇద్దరిని కలిపి నలుగురితో సమన్వయ కమిటీ వేస్తానన్నారు. కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలందరూ కలిసి మెలిసి పనిచేయాలన్నారు. ప్రతీ గ్రామానికి తానే స్వయంగా వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ కొత్త దిమ్మెలు నిర్మించి అందరికీ కండువాలు కప్పుతానన్నారు. తాను రాజకీయాల్లో ఉన్ననాళ్లు కొడంగల్‌ నుంచే పోటీ చేస్తానన్నాయన మరోసారి స్పష్టం చేశారు. స్థానికంగా తన సోదరుడు తిరుపతిరెడ్డిని పెట్టింది కేవలం కార్యకర్తల కష్టనష్టాలను చూసుకోవడం కోసమేనని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో పార్టీ అధిష్టానం మేరకు పాత పది జిల్లాల్లో తిరిగే పరిస్థితి వస్తే కూడా కార్యకర్తలు అన్యదా భావించవద్దని కోరారు.

దోపిడీ పాలనకు చరమగీతం : డీ.కే.అరుణ
రాష్ట్రంలో సాగుతున్న దోపిడీ పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం చాలా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీ.కే.అరుణ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు సైతం విరివిగా నిధులు మంజూరు చేశామన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని, ప్రతిపక్ష పార్టీల పట్ల వివక్ష కొనసాగుతుందన్నారు. అంతేకాదు ప్రాంతాల మధ్య కూడా వివక్ష చూపుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ నిధులన్నీ గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటకే కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. కొడంగల్‌ నియోజకవర్గంతో పాటు కాంగ్రెస్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

నారాయణపేట–కొడంగల్‌ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం కోసం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అలైన్‌మెంట్‌లో తాము అధికారంలోకి రాగానే మార్పు చేస్తామన్నారు. తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఆలోచనల మేరకు ఇక్కడి పొలాలకు నీరు పారిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దొరపాలనకు చరమ గీతం పాడాలంటే కేసీఆర్‌ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని దేవరకద్ర నియోజకవర్గ ఇంచార్జి పవన్‌కుమార్‌ స్పష్టంచేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top