మోగుతున్న రెబెల్స్‌

Rebels Participate Against TDP Leaders in Visakhapatnam - Sakshi

సిట్టింగ్‌లకే ఛాన్స్‌ కొత్తవారికి నిరాశే

జిల్లా కాపులకు మొండిచేయి

టీడీపీ రెబల్‌గా దిగేందుకు పలువురు సన్నద్ధం

పార్టీలోకే రాని సబ్బం హరికి భీమిలి టికెట్‌

సాక్షి, విశాఖపట్నం: అసంతృప్తులు, అసమ్మతి సెగల మధ్య టీడీపీ టికెట్ల పంచాయతీ కొలిక్కి వచ్చింది.అయితే రెబల్స్‌ బెడద మాత్రం తప్పేలా లేదు. షెడ్యూల్‌ ప్రకటించినా పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించకుండా చంద్రబాబు హైడ్రామా నడిపారు. దీంతో ఈ సారి పలు నియోజకవర్గాల్లో కొత్త వారికి సీట్లు లభిస్తాయని అంతా భావించారు. తీరా సోమవారం అర్ధరాత్రి టికెట్లు కేటాయించిన చంద్రబాబు సిట్టింగ్‌లకే ఇచ్చారు. భీమిలి నియోజకవర్గంలో మాత్రం ఇంకా పార్టీలో చేరని సబ్బం హరికి కేటాయించడంతో చర్చాంశనీయమైంది.  మరో వైపు ఈ సారి కూడా సిట్టింగ్‌లకే అవకాశం లభించడంతో పలు నియోజకవర్గాల్లో రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

సీట్ల పంపిణీలో కొరవడినసామాజిక న్యాయం
సీట్ల కేటాయింపులో పార్టీ అధినేత సామాజిక న్యాయం పాటించలేదని అధికార పార్టీ సీనియర్లే ఆరోపిస్తున్నారు. జిల్లాలోని మెజార్టీ సామాజిక వర్గీయులైన కాపులతో పాటు సింహ భాగంగా ఉన్న మహిళలకు సముచిత స్థానం ఇవ్వలేదని విమర్శలు విన్పిస్తున్నాయి. మూడు లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒకే  స్థానాన్ని  మహిళకు కేటాయించారు. 11 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశం కల్పించారు. అరుకు నుంచి మంత్రి కిడారి శ్రావణ కుమార్‌కు టికెట్‌ కేటాయించారు. మాడుగుల నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు మళ్లీ ఛాన్స్‌ ఇచ్చారు. ఇంకా టీడీపీ తీర్థం పుచ్చుకోని మాజీ ఎంపీ సబ్బం హరికి భీమిలి టికెట్‌ కేటాయించారు.రాజకీయాలతో సంబంధం లేని కేజీహెచ్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ బంగారయ్యకు పాయకరావుపేట అసెంబ్లీ టికెట్‌ ఇచ్చారు.  తొలి రెండు జాబితాల్లో  చోటు దక్కక అసంతృప్తితో ఉన్న బండారు సత్యనారాయణమూర్తికి ఎట్టకేలకు మళ్లీ పెందుర్తి టికెట్‌ కేటాయించారు. గాజువాక సిట్టింగ్‌ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును విశాఖ ఎంపీకి పంపాలన్న యోచనతో ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టిన గాజువాక సీటు ను చివరి జాబితాలో పల్లాకే ఖరారు చేశారు. తొలుత పాతమిత్రుడు పవన్‌ కల్యాణ్‌ కోసం పల్లాను ఎంపీకి పంపి ఆ స్థానంలో డమ్మి అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించారు. కానీ విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో చివరి నిమిషంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పల్లాకే ఆ సీటు కేటాయించారు.అయితే ఆయనకు రెబల్‌ బెడద తప్పేలా లేదు.

భరత్‌కే విశాఖ లోక్‌సభ సీటు
దివంగత ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మనుమడు ఎం.శ్రీభరత్‌కు విశాఖ లోక్‌సభ సీటు కేటాయించారు. ఈ టికెట్‌ విషయంలో దోబుచులాడిన చంద్రబాబు ఎట్టకేలకు వియ్యంకుడు బాలకృష్ణ ఒత్తిడితో భరత్‌కే ఇచ్చారు. మరో వైపు విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్‌కు అనకాపల్లి లోక్‌సభ స్థానాన్ని కేటాయించారు. ఇటీవలే పార్టీ తీర్థం పుచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌కు అరుకు లోక్‌సభ స్థానాన్ని కేటాయించారు.

అభ్యర్థులకు రెబల్స్‌ గుబులు
మెజార్టీ సీట్లన్నీ సిట్టింగ్‌లకే కేటాయించడంతో ఆశావాహులు అంసతృప్తితో రగిలిపోతున్నారు. వివిధ నియోజకవర్గాల్లో పలువురు టీడీపీరెబెల్స్‌గా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పాయకరావుపేట టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు కుమార్తె విజయలక్ష్మి రెబల్‌గా దిగేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. గాజువాక నుంచి టీడీపీ సీనియర్‌ నేత, మాజీ కార్పొరేటర్‌ లేళ్లకోటేశ్వరరావు రెబెల్‌గా నామినేషన్‌ వేయనున్నారు. పార్టీలో కూడా చేరని మాజీ ఎంపీ సబ్బం హరికి భీమిలి టికెట్‌ కేటాయించడాన్ని నిరసిస్తూ టీడీపీ సీనియర్‌ నేత కోరాడ రాజబాబు టీడీపీకి రాజీనామా చేశారు.ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం,పెందుర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిలు రెబెల్‌గా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. విశాఖ ఉత్తరం నుంచి నరవ రాంబాబు రెబెల్‌గా నామినేషన్‌ వేసేందుకు సిద్ధపడగా మంత్రి గంటా బుజ్జగించడంతో కాస్త మెత్తబడిన ప్పటికీ  ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్టుగా చెబుతున్నారు. పాడేరు నుంచి మాజీ మంత్రి మణికుమారి రెబల్‌గా బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరో వైపు చోడవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌రాజు, మాడుగుల పార్టీ ఇన్‌చార్జి గవిరెడ్డి రామానాయుడుకు టికెట్లు ఇస్తే ఓడిస్తామని పార్టీలోనే సీనియర్లు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించారు.నర్సీపట్నంలో మంత్రి అయ్యన్న కుమారుడు ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ సోదరుడు సన్యాసిపాత్రుడు వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. యలమంచలిలో పంచకర్ల రమేష్‌ బాబుకు వ్యతిరేకంగా పనిచేసేందుకు మిగిలిన నేతలు పావులు కదుపుతున్నారు.

జిల్లా కాపులకుమొండిచేయి
టీడీపీలో జిల్లాలోని కాపులకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 15 లక్షలకు పైగా జనాభా ఉన్న  జిల్లాలో ఒక్క స్థానాన్ని కూడా స్థానిక కాపులకు కేటాయించకపోవడాన్ని పార్టీలోని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో పాతుకుపోయిన వలస నేతలైన ప్రకాశం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు (కాపు),పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పంచకర్ల రమేష్‌బాబులకు మాత్రమే సీట్లు కేటాయించారు. పార్టీలో జిల్లాకు చెందిన కాపునాయకులైన  కశింకోట జెడ్పీటీసీ సభ్యురాలు మలసాల ధనమ్మ, మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం, పార్టీ సీనియర్లు పినబోలు వెంకటేశ్వర్లు, విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సీతా వెంకటరమణ వంటి సీనియర్లు టికెట్లు ఆశించినా టికెట్లు దక్కలేదు. దీంతో పార్టీలోని కాపులు అంతర్గతంగా  అసంతృప్తితో రగిలిపోతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top