మోదీజీ మీరెలాంటి హిందువు

Rahul slams Modi at Udaipur rally - Sakshi

రాహుల్‌ గాంధీ సూటి ప్రశ్న

జైపూర్‌: రాజస్తాన్‌ ఎన్నికల ప్రచారంలో నేతల మాటల వాడి పెరిగింది. శనివారం ఉదయ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్‌ మాట్లాడుతూ..‘తను హిందూనంటూ ప్రధాని మోదీ చెబుతుంటారు. కానీ, ఆయనకు హిందూయిజం మూలాలు అర్థం కావు. ఆయన ఎలాంటి హిందువు?’ అని ప్రశ్నించారు. ‘హిందూయిజం సారం ఏమిటి? ప్రతి ఒక్కరిలోనూ విజ్ఞానం ఉంటుంది. మన చుట్టూతా విజ్ఞానం ఉంది. ప్రతి జీవికీ విజ్ఞానం ఉంటుంది. ఇదే కదా భగవద్గీత చెబుతోంది?’ అని అన్నారు.

2016లో భారత్‌ బలగాలు పాక్‌ భూభాగంపై చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ను కూడా ప్రధాని మోదీ అప్పటి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వాడుకున్నారని రాహుల్‌ ఆరోపించారు. మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉండగా ఇలాంటి సైనిక చర్యలు మూడు జరిగినా అవి బయటకు వెల్లడికాలేదని తెలిపారు. యూపీఏ హయాంలో నిరర్ధక ఆస్తులు రూ.2 లక్షల కోట్ల మేర ఉండగా బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.12 లక్షల కోట్లకు పెరిగిపోయాయని విమర్శించారు.

ఆ అగత్యం రాకూడదు?: సుష్మ
మంత్రి సుష్మా స్వరాజ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘హిందూయిజం గురించి రాహుల్‌ గాంధీ ద్వారా తెలుసుకోవాల్సిన ఆగత్యం ప్రజలకు రాకూడదని కోరుకుంటున్నా. ఆయన మతం, కులం ఏమిటో తెలియక రాహుల్‌తోపాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా అయోమయంలో ఉన్నాయి’ అని ఎద్దేవా చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top