
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీటర్‌లో హిందీలో వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ, నోట్లరద్దు నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో పడిందనీ, ‘డాక్టర్’ జైట్లీ మందులు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయని రాహుల్ పేర్కొన్నారు. జైట్లీని ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేస్తూ ‘ఆప్ కహతే హై ఆప్ కిసీ సే కమ్ నహీ. మగర్ ఆప్ కీ దవా మే దమ్ నహీ’ (మేం ఎవరి కన్నా తక్కువ కాదని మీరు చెప్పుకుంటున్నారు. కానీ మీ మందులో దమ్ము లేదు) అని వ్యాఖ్యానించారు.
మరో సందర్భంలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నోట్లరద్దు, జీఎస్టీ అనే రెండు తుపాకీ గుళ్లను దేశ ఆర్థిక వ్యవస్థ గుండెల్లో పేల్చి చంపేసిందని దుయ్యబట్టారు. ఈ రెండు నిర్ణయాల వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అనేకం మూతపడి ఎంతోమందికి ఉద్యోగాలు పోతున్నా జైట్లీ మాత్రం రోజు మార్చి రోజు టీవీలో కనపడి అంతా బాగుందని అబద్ధాలు చెబుతున్నారని రాహుల్ విమర్శించారు. ఇదే కార్యక్రమంలో బాక్సర్ విజేందర్ సింగ్ అడిగిన ప్రశ్నకు రాహుల్ సమాధానమిస్తూ.. తనకు పెళ్లి ఎప్పుడు రాసిపెట్టి ఉంటే అప్పుడు జరుగుతుందని వ్యాఖ్యానించారు.