రాహుల్‌ లెక్కల్లో తప్పెంతా?

Rahul Gandhi Misquotes Employment Figures - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏడాదికి కేవలం నాలుగు లక్షల ఉద్యోగాలను మాత్రమే కల్పించిగలిగిందని ధ్వజమెత్తారు. చైనా ప్రభుత్వం ప్రతి 24 గంటలకు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుండగా, భారత్‌ ప్రతి 24 గంటలకు 400లకు మించి ఉద్యోగాలు కల్పించలేక పోతోందంటూ విమర్శించారు. రాహుల్‌ చెప్పేవన్నీ అబద్ధాలని, చూపేవన్నీ తప్పుడు లెక్కలని బీజేపీ నాయకులు విమర్శించారు. అయితే వారెవరూ తమ విమర్శలను నిరూపించలేకపోయారు. ఎందుకంటే వారి వద్ద ఎలాంటి లెక్కలు లేవు.

తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏయే విభాగాల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చామో లెక్క తేల్చాల్సిందిగా లోక్‌సభ సమావేశాలు ముగిశాక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెల్సింది. ‘మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇప్లిమెంటేషన్‌’ 2017 ఇయర్‌ బుక్, వివిధ ప్రభుత్వ పారిశ్రామిక సంస్థల అప్‌డేట్స్, ఫ్యాక్టరీ ఎంప్లాయిమెంట్‌ డాటా, ‘ఫాప్స్‌ అండ్‌ కమర్షియల్‌ ఎంప్లాయీమెంట్‌ ఫిగర్స్‌’ను పాత్రికేయులు క్షుణ్నంగా పరిశీలించగా ఆశ్చర్యంగా 2014 సంవత్సరం నుంచి ఉపాధి అవకాశాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ లేవు.

భారత కార్మిక శాఖ మాత్రం 2016 నుంచి ప్రతి మూడు నెలలకోసారి దేశంలోని ఉపాధి అవకాశాలపై సర్వే జరిపినట్లు ఉంది. 2018, మార్చి 12న భారత కార్మిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2016–2017 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశంలో 77 వేల ఉద్యోగాలు పెరగ్గా, మూడవ త్రైమాసికంలో 32 వేల ఉద్యోగాలు పెరిగాయి. నాలుగవ త్రైమాసికంలో 1.22 లక్షలు, ఐదవ త్రైమాసికంలో 1.85 లక్షల ఉద్యోగాలు పెరిగాయి. ఉద్యోగాలు నాలుగైదు త్రైమాసికంలో పెరగడానికి గల కారణాలేమిటో వివరించలేదు. రోజుకు 1,139 ఉద్యోగాలు కల్పించినట్లు కార్మిక శాఖ పేర్కొంది. ఈ లెక్కలు నిజమనుకుంటే రాహుల్‌ చెప్పిన రోజుకు 400 ఉద్యోగాల లెక్క తప్పు.

ఇక చైనా రోజుకు 50 వేల ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు రాహుల్‌ గాంధీ చెప్పారు. రోజుకు 37,013 చొప్పున, ఏడాదికి 1.10 కోటి ఉద్యోగాలను కల్పించాలన్నది 2017 సంవత్సరానికి చైనా లక్ష్యంగా పెట్టుకోగా 1.35 కోట్ల ఉద్యోగాలు కొత్తగా కల్పించినట్లు చైనా మానవ వనరులు, సామాజిక భద్రతా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంటే రోజుకు దాదాపు 38 వేల ఉద్యోగాలను కల్పించినట్లే. రాహుల్‌ కాస్త అతిశయోక్తిగా చెప్పినప్పటికీ ఉద్యోగాల కల్పనలో చైనా మనకన్నా అందనంత దూరానుంది. అందుకే చైనాలో నిరుద్యోగం 3.9 శాతం కాగా, భారత్‌లో 7.1 శాతంగా ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top