అవకాశవాద రాజకీయాలకు రోల్‌ మోడల్‌ చంద్రబాబు

Rachamallu Shiva Prasad Reddy Slams Chandrababu Naidu - Sakshi

విశ్వనీయతకు మారుపేరు జగన్‌

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు : ఈ ఎన్నికలు నూటికి నూరు శాతం విశ్వసనీయతకు, అవకాశవాద రాజకీయాల మధ్యనే జరుగుతాయని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని రామాపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. తొలుత కాంగ్రెస్‌పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు మామపై కూడా పోటీ చేస్తానని మాట్లాడారన్నారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మామ పక్షాన చేరిపోయారన్నారు. తర్వాత టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ చాపకింద నీరులా తన అనుకూల వర్గాన్ని, వాతావరణాన్ని తయారు చేసుకున్నారని తెలిపారు. అదునుచూసి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని సంపాదించారని పేర్కొన్నారు. తర్వాత ఎన్టీఆర్‌ సంతానాన్ని, తన తోడల్లుడిన తన అవకాశవాద రాజకీయాల కోసం బలిచేశారన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణతోపాటు వారి కుటుంబ సభ్యులెవ్వరిని పైకి రాకుండా చేశారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి ఐదేళ్లకు ఒక రాజకీయ పార్టీతో పొత్తు ఏర్పాటు చేసుకుని అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని నరేంద్రమోదీని ప్రశంసించిన చంద్రబాబు కాంగ్రెస్‌ను విమర్శించారన్నారు. నాడు సోనియాను ఇటలీ దెయ్యెం అన్న నోటితోనే నేడు ఇండియా దేవత అంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. తన అవకాశవాద రాజకీయాల కోసం ప్రజలను కూడా వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. విశ్వసనీయతకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిరూపమని తెలిపారు. ఇచ్చిన మాట కోసం కట్టుబడి పోరాటం చేస్తున్నారన్నారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణ వార్త విన్న వెంటనే ఓదార్పు యాత్ర చేస్తానని ప్రకటించినందుకు 9 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నారని, 16 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారన్నారు. మధ్యలో ఎన్నో అవమానాలను, అపనిందనలను జగన్‌ ఎదుర్కొన్నారని చెప్పారు. చివరికి జగన్‌ కుటుంబ సభ్యులను అవమానించి కాకుల్లా పొడిచారన్నారు. ఇచ్చిన మాట కోసం సొంత అజెండాతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీని స్థాపించి ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషిస్తున్నారన్నారు.

ప్రజా సంకల్ప యాత్రలో 14 నెలలపాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. ఇలాంటి పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు తాను సంతోషిస్తున్నానని తెలిపారు. అపారమైన అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుండగా, విశ్వసనీయతతో జగన్‌ ఆదర్శంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్,  మండల పరిషత్‌ ఉపా«ధ్యక్షుడు మల్లేల రాజారాంరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రాప్తం యాకోబ్, పోరెడ్డి నరసింహారెడ్డి, మండల కన్వీనర్‌ దేవీప్రసాదరెడ్డి, జెడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ అక్బర్, ఆయిల్‌ మిల్‌ ఖాజా, జిల్లా ప్రధాన కార్యదర్శులు కల్లూరు నాగేంద్రారెడ్డి, శేఖర్, చెన్నకేశవరెడ్డి, పెద్దశెట్టిపల్లె సుధాకర్‌రెడ్డి, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి, బలిమిడి చిన్నరాజు, సుబ్బరా యుడు, తుపాకుల భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top