కృష్ణాలో టీడీపీని వీడుతున్న బలమైన సామాజిక వర్గం

In the Presence of YS Jagan, Members of the Social Community Who Can Influence Politics in the Krishna District Joined the Party - Sakshi

సాక్షి, అమరావతి : కృష్ణా జిల్లాలో రాజకీయాలను ప్రభావితం చేయగల సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రముఖులు వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. సీనియర్‌ నేత వసంత నాగేశ్వరరావు, ఆయన తనయుడు కృష్ణప్రసాద్‌తోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జైరమేష్, ఆయన సోదరుడు దాసరి బాలవర్ధనరావు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిలకు విజయవాడ, గన్నవరంలో గట్టి పట్టు ఉంది. వీరంతా వైఎస్సార్‌సీపీలో చేరారు. స్వయానా మంత్రి దేవినేని ఉమా సోదరుడు చంద్రశేఖర్‌ ప్రసాద్‌ ఇటీవలే వైఎస్సార్‌సీపీలో చేరారు.

విజయవాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్‌కు అన్ని వర్గాల ప్రజలతో విస్తృత సంబంధాలున్నాయి. అవనిగడ్డకు చెందిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ బూరగడ్డ రమేష్‌ నాయుడు చేరికతో నియోజక వర్గంలో సమీకరణాలు  మారుతున్నాయి. పామర్రు మాజీ ఎమ్మెల్యే డీవై దాస్‌ గురువారం జగన్‌ సమక్షంలో చేరారు.

వైఎస్సార్‌ జిల్లాల్లో టీడీపీకి ఏకైక ఎమ్మెల్యే గుడ్‌బై
గత ఎన్నికల్లో వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి అధికార పార్టీని, పదవులను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు అందరితో సత్సంబంధాలున్నాయి. చాలా కాలం క్రితమే వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్‌ నేత సి.రామచంద్రయ్యకు రాజంపేట, మైదుకూరు, కడప సెగ్మెంట్లలో బలమైన సామాజిక వర్గం అండగా ఉంది. మరో సీనియర్‌ నేత డీఎల్‌ రవీంద్రారెడ్డి వైఎస్సార్‌సీపీకి మద్దతు ప్రకటించి ప్రచారంలో చురుగ్గా పని చేస్తున్నారు. 

మంగళగిరిలో టీడీపీకి షాక్‌...
గుంటూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డికి నరసరావుపేట, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో బలమైన వర్గం ఉంది. మంగళగిరి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మైనారిటీ నేత షౌకత్, జడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌కు ఆయా సామాజిక వర్గాల్లో మంచి పరిచయాలున్నాయి. బలమైన వర్గం కలిగిన రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. మాజీమంత్రి మహమ్మద్‌ జానీ, ఆయన ఇద్దరు కుమారులు, రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు తాజాగా చేరారు. బలమైన వర్గం వీరి వెంట ఉంది. 
 

మాగుంట చేరికతో మారిన రాజకీయం..
ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసులురెడ్డి టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీ ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నారు. టీడీపీకి గుడ్‌బై చెప్పిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు గిద్దలూరు, మార్కాపురం సెగ్మెంట్లలో మంచి పలుకుబడి ఉంది. పరిచయం అవసరం లేని సీనియర్‌ నేత  దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ప్రజల్లో మంచి పేరుంది.  స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆమంచి కృష్ణమోహన్‌ పోరాటపటిమ కలిగిన నేత. వైఎస్సార్‌సీపీలో చేరిన ఈదర మోహన్‌ ఒంగోలు, సంతనూతలపాడులో ప్రభావం చూపగలరు.

హిందూపురంలో సైకిల్‌కు పంక్చర్‌..
అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు అబ్దుల్‌ ఘనీ, మెట్టు గోవిందరెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరారు.  జేసీ దివాకరరెడ్డి ప్రధాన అనుచరుడు కోగటం విజయ భాస్కరరెడ్డి, పరిటాల రవి స్నేహితుడు వేపగుంట రాజన్న టీడీపీని వీడారు. మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకట నాయుడుకూడా వైఎస్సాసీపీలో చేరారు. 

టీడీపీ టికెట్‌ ఇచ్చినా రాజీనామా చేసి..
 నెల్లూరు జిల్లాలో టీడీపీ నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించిన ఆదాల ప్రభాకరరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ టికెట్‌పై ఆయన నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి బల్లి దుర్గాప్రసాద్‌ కూడా టీడీపీని వీడి తిరుపతి నుంచి వైఎస్సార్‌ సీపీ తరపున లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఇక ఆనం కుటుంబం ప్రభావం నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో బలంగా ఉంది. దివంగత సీఎం నేదురుమల్లి జనార్థనరెడ్డి కుమారుడు రామ్‌ కుమార్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌ సీపీలో చేరారు. 

చంద్రబాబు మోసాన్ని గ్రహించి..
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ టికెట్‌పై కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బుట్టా రేణుక, ఎస్వీ మోహన్‌రెడ్డి అనంతరం టీడీపీలో చేరినా చంద్రబాబు వైఖరితో మనస్థాపం చెంది తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎస్వీతోపాటు ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నౌమన్‌ కూడా పార్టీలో చేరారు. రిటైర్డ్‌ రాయలసీమ ఐజీ మహమ్మద్‌ ఇక్బాల్‌ వైఎస్సార్‌సీపీలో కీలకపాత్ర పోషిస్తున్నారు.   ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతి సీడ్స్‌ అధినేత పోచా బ్రహ్మానందరెడ్డికి రైతులతో మంచి సంబంధాలున్నాయి. గురు రాఘవేంద్ర విద్యాసంస్థల అధినేత దస్తగిరిరెడ్డి చేరడం నంద్యాలలో వైఎస్సార్‌సీపీకి మరింత బలం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top