ప్రతీ హామీ నెరవేర్చాకే ఓట్లు అడుగుతాం

Prajasankalpayatra YS Jagan speech at Yerraguntla Centre - Sakshi

ప్రజలకు భరోసా ఇచ్చేందుకే పాదయాత్ర

రెండు లేదా మూడు పేజీలతో మేనిఫెస్టో

ప్రతీ హామీని పూర్తి చేశాకే ఓట్లు అడుగుతాం 

సాక్షి, జమ్మలమడుగు: కిక్కిరిసిన జనంతో ఎర్రగుంట్ల జనసంద్రమైంది. వైయస్ జగన్ కు మద్దతుగా వేలాది మంది ప్రజలు కదం తొక్కారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఎర్రగుంట్ల నాలుగురోడ్ల కూడలికి చేరుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అశేషప్రజానీకం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అసమర్థ పాలన వల్ల నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా  సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించాల్సి వచ్చిందని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు చంద్రబాబు పాలనలో మోసపోయారని  అన్నారు.  రైతులు, చేనేత కార్మికులు, యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని,  ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర ప్రారంభించానన్నారు. ‘ఏడాది తర్వాత మనందరి పాలన వస్తుంది. ఆ పాలనలో మంచి రోజులు వస్తాయి’ అని ఆయన పునరుద్ఘాటించారు. 

ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు అనేక  హామీలు ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని జగన్ అన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ రెండు లేదా మూడు పేజీల మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తుందని.. అందులోని ప్రతీ హామీని 2024 ఎన్నికల్లోపు పూర్తి చేశాకే ప్రజలను మళ్లీ ఓట్లు అడుగుతామని ఆయన స్పష్టం చేశారు. అందరి జీవితాల్లో వెలుగు నింపేందుకే నవరత్నాలను ప్రకటించానని.. ప్రజల సలహా మేరకు వాటిని మరింత మెరుగుపరుస్తానని ఆయన చెప్పారు. 

ఇంకా ఆయన ఏం చెప్పారంటే... 

చంద్రబాబు పాలనలో రుణమాఫీ అమలు సరిగ్గా అమలు కావటం లేదంటూ ఈరోజు (గురువారం) ఉదయం కొందరు రైతులు తనను  కలిసిన విషయాన్ని గుర్తు చేసిన జగన్‌.. అధికారంలోకి వస్తే ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు తీసుకొస్తానని చెప్పారు. ఈ నాలుగేళ్ల బాబు పాలనలో బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు వచ్చిందా? అని ఆయన రైతులనుద్దేశించి  ప్రశ్నించారు(దానికి లేదు అన్న సమాధానం వారి నుంచి వినిపించింది). గిట్టుబాటు ధర లభించక రైతులు రోడ్డున పడ్డారని.. వారి సంక్షేమం కోసమే రైతు భరోసా కార్యక్రమాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతి పంటకు ముందుగానే ధర  ప్రకటించి అదే ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఎంత రుణం ఉంటే అంత డబ్బును చేతికే అందిస్తామని పేర్కొన్నారు.  నాలుగు విడతల్లో రైతులకు రూ.50 వేలు ఇస్తామని చెప్పారు.

చంద్రబాబు మాట తప్పారు..
­పొదుపు సంఘాలు తానే కనిపెట్టానని అక్కచెల్లెళ్లను చంద్రబాబు మోసం చేశారు. రుణాలన్నీ రద్దు చేస్తానని మాట తప్పారు. నేను అధికారంలోకి వచ్చాక మీకు ఎంత రుణం ఉంటే అంత డబ్బును మీ చేతికే ఇస్తాం. చదువుకునే పిల్లలకు ఆర్థిక సహాయం కోసం ‘అమ్మ ఒడి’ పథకం అమలు చేస్తాం. ప్రైవేట్‌ స్కూళ్లలో చదివేవారికి కూడా వర్తిస్తుంది. ప్రతి కుటుంబానికి రూ.15వేలు డబ్బు వస్తుంది. పెన్షన్ల కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగే అవసరం లేదు. గ్రామాల్లోనే పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇప్పిస్తాం. కులాలు, మతాలతో సంబంధం లేకుండా అందరికీ న్యాయం చేస్తాం.

ప్రతి అవ్వా, తాతకు రూ.2వేల పెన్షన్‌ ఇస్తాం. అవసరం అయితే రూ.3వేలు కూడా ఇచ్చేందుకు వెనకాడం. నాలుగేళ్లలో పేదలకు చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఇల్లులేని నిరుపేదలందరికీ మన పాలనలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం. మన పాలనలో ఇల్లులేని వారు ఎవరూ ఉండరు. 104,108 సేవలను మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఆరోగ్యశ్రీని పకడ్బందీగా అమలు చేస్తా. కుటుంబ పెద్ద ఆపరేషన్‌ చేయించుకుంటే రూ.10వేలు ఆర్థిక సాయం. అలాగే చదువుల కోసం ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాలేజీ విద్యార్థులకు అవసరం అయ్యే పూర్తి ఫీజులను చెల్లిస్తాం. ఖర్చుల కోసం ఏటా రూ.20వేల నగదు ఇస్తాం.

ఉద్యోగాల విప్లవం..
యువకుల కోసం ఉద్యోగాల విప‍్లవం తెస్తాం. ప్రత్యేక హోదా తీసుకొచ్చి అందరికీ ఉపాధి కల్పిస్తాం. హోదా కోసం అందరం కలిసికట్టుగా పోరాడుదాం. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జిల్లాలో స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేస్తాం. స్టీల్‌ ఫ్యాక్టరీలో 10వేల మందికి ఉపాధి కల్పిస్తాం. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేస్తాం. ఖాళీగా ఉన్న లక్షా 40వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఏటా డీఎస్సీ నిర్వహించి ఖాళీలు లేకుండా చేస్తాం.

చట్టసభలను ఖూనీ చేస్తున్నారు..
చంద్రబాబు నాయుడు చట్టసభలను ఖూనీ చేస్తున్నారు. సంతలో గొర్రెల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారు. 20 కోట్లా, 40 కోట్లా, ప్రాజెక్టులా అంటూ ఎంపీలను కొంటున్నారు. అందులో నలుగురిని మంత్రులను చేశారు. మంత్రులు ఏ పార్టీ ఎమ్మెల్యేలో తెలియని పరిస్థితి తెచ్చారు. అలాంటి అసెంబ్లీకి మనం వెళ్లాలా?. మనం వెళ్లకుంటే దేశమంతా ఇటువైపు చూస్తుంది. ఆ 20మందిపై వేటు వేసి ఎన్నికలు వెళ్లండని చెబుతుంది. ఒక్క ఎన్నికైతే రూ.200 కోట్లతో చంద్రబాబు మేనేజ్‌ చేస్తారు. 20 చోట్ల అయితే రూ.4వేల కోట్లు కావాలి. అంత నల్లడబ్బును తీస్తే చంద్రబాబును ప్రధాని మోదీ పట్టుకుంటారు. అందుకే ఆ డబ్బులు తీయడు..ఎన్నికలకు వెళ్లడు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఒకటే విషయం చెబుతున్నా. పల్లె నిద్ర చేయండి..రచ్చబండలు నిర్వహించండి. టీవీల్లో అసెంబ్లీని చూపిస్తారో...ప్రజల్లో ఉన్న మనల్ని చూపిస్తారో చూద్దాం. చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిద్దాం.

మద్యపాన నిషేధం ...
దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాం. దారివెంట మీరిచ్చే ప్రతి సలహా, సూచనలు స్వీకరిస్తా. చెప్పినవే కాకుండా చెప్పనవి కూడా అమలు చేస్తా. నిండు మనసుతో ఆశీర్వదించండి. తోడుగా నిలబడండి.’ అని వైఎస్‌ జగన్‌ ప్రజలను కోరుకుంటూ పాదయాత్రను ముందుకు కొనసాగించారు.
ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు తీసుకోస్తాం 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top