ముందుగా ‘పారదర్శకత’ కావాలి!

Political Parties Willing To Be Transparent Too - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల సంస్కరణలపై సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షం ప్రధానంగా పోలింగ్‌లో ఈవీఎంల విధానానికి స్వస్తి చెప్పి మళ్లీ బ్యాలెట్‌ విధానానికి రావాలని ప్రతిపాదించాయి. పాలకపక్షంలోని శివసేన సహా 70 శాతం పార్టీలు బ్యాలెట్‌ విధానానికే స్వాగతం పలికాయి. మళ్లీ బ్యాలెట్‌ విధానం ఎందుకని వాదించిన పార్టీలు కూడా ఈవీఎంలను మరింత పటిష్టం చేయాలని, లోపరహితంగా ఉండేలా చూడాలని పిలుపునిచ్చాయి. గత వరుస ఎన్నికల్లో ఓటమి మింగుపడని బీజేపేతర ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా బ్యాలెట్‌ విధానాన్ని డిమాండ్‌ చేస్తున్నాయనే విషయం ప్రజలకు తెల్సిందే. ఏ సాంకేతిక పరిజ్ఞానానికి సరైన భద్రతలేని భారత్‌లాంటి వర్ధమాన దేశంలో ప్రతిపక్షాల విమర్శలను, సూచనలను ఎన్నికల కమిషన్‌ తీవ్రంగానే తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఏడాది జరిగిన కొన్ని ఎన్నికల్లో పలు ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో ఇది మరింత అవసరం.

అఖిలపక్ష సమావేశం అనగానే ముందుగా ప్రధాని మోదీ జమిలి ఎన్నికల అవసరం గురించి మాట్లాడుతారని అందరు ఆశించారు. ఎందుకోగానీ ఆయన ఆ ప్రస్థావననే తీసుకరాలేదు. ఎన్నికల సందర్భంగా పార్టీలు పెడుతున్న ఖర్చులపై కూడా పరిమితి ఉండాలన్న విషయం కూడా చర్చకు వచ్చింది. ప్రస్తుతం దేశంలో అభ్యర్థులు పెడుతున్న ఖర్చుపైనే పరిమితులు ఉన్నాయి. పార్టీకి కూడా పరిమితులు విధిస్తే అభ్యర్థులు తమ ఖర్చులను పార్టీ కోటాలో వేస్తారన్న ఉద్దేశంతో నాడు పార్టీల ఖర్చుపై పరిమితులు విధించలేదు. ఎక్కువ మంది అభ్యర్థులు, పాలకపక్ష అభ్యర్థులు పరిమితికి మించి ఖర్చుచేస్తున్నారని, అయితే వాటి వివరాలను వెల్లడించడం లేదన్నది ప్రజలందరికి తెల్సిందే. ఇప్పుడు పార్టీకి పరిమితులు విధించినా రేపు అదే జరుగుతుందని, పార్టీలు పరిమితికి మించి ఖర్చు పెట్టి, లెక్కలను పరిమితి లోపల చూపిస్తాయని తెలిసిందే. అందుకని ఆ పరిమితి విధానం వల్ల పెద్దగా లాభం లేదు.

పార్టీలకు విరాళాల విధానం మరింత పారదర్శకంగా ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అందులో న్యాయం ఉంది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల విధానం సవ్యంగా లేదు. అది పాలకపక్షానికి అనుకూలంగా ఉంది. పారదర్శకతా లేదు. అందులో తక్షణం సంస్కరణలు అవసరం. అలాగే ఆరు జాతీయ పార్టీలు ప్రజా స్క్రూటినీకి వీలుగా ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకరావాలని 2013లో కేంద్ర సమాచార కమిషనర్‌ సూచించారు. నాడు దాన్ని నిర్లక్ష్యం చేసిందీ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమే అయినందున ఆ అంశాన్ని తీసుకరావాలంటే కాంగ్రెస్‌కు ఇబ్బందే ఉంటుందిగానీ పారదర్శకత కావాలంటే ఆ సూచనను అమలు చేయాల్సిందే. అందుకు మోదీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top