
సాక్షి, కోడంగల్ : టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచరుల ఇళ్లపై పోలీసులు శనివారం రాత్రి దాడులు జరిపారు. దీంతో మఫ్టీ పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ రేవంత్‌రెడ్డి ఆందోళనకు దిగారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో కొడంగల్ పట్టణంలోని రేవంత్ ముఖ్య అనుచరులైన మహ్మద్ యూసఫ్, నందారం ప్రశాంత్ తదితరుల ఇళ్లలో మఫ్టీ పోలీసులు తనిఖీలు చేశారు. వారి వద్ద ఏమీ దొరకకపోవడంతో పోలీసులు సామగ్రిని చిందరవందరగా పడేశారని వారు ఆరోపించారు.
ఈనేపథ్యంలో 10 గంటల సమయంలో కొండగల్‌లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు తాండూరు–మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఇందులో రేవంత్ పాల్గొని అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనిఖీలు చేసింది ఎవరో తనకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లపై అధికార పార్టీ కక్షపూరితంగా దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. తనకు ప్రాణహాని ఉందని ఈ సందర్భంగా రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.