విపక్షాల కార్లపైనే పోలీసుల నిఘా! 

Police intelligence focus on opposition cars - Sakshi

     టాస్క్‌ఫోర్స్‌ డీసీపీపై ట్విట్టర్‌లో ఉత్తమ్‌ ఆరోపణలు 

     దూకుడుగా బదులిచ్చిన మంత్రి కేటీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మంత్రి కేటీఆర్‌ మధ్య ట్విట్టర్‌లో ఆరోపణలు, ప్రత్యారోపణల పరంపర కొనసాగుతోంది. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకృష్ణ రావును కేటీఆర్‌కు అంకుల్‌ అంటూ సంబోధిస్తూ.. కేవలం ప్రతిపక్ష నేతల కార్లను మాత్రమే రాధాకృష్ణరావు తనిఖీ చేస్తున్నారని తొలుత ఉత్తమ్‌ ట్విట్టర్‌ ద్వారా ఆరోపించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి అక్రమ, పక్షపాత చర్యల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి దిగజారుడు, చౌకబారు ఆరోపణలు మానుకోవాలని మంత్రి కేటీఆర్‌ ప్రతిస్పందించారు. ఓ సామాజికవర్గానికి చెందిన వారంతా బంధువులు, పక్షపాతం గల వారని మీ ఉద్దేశమా? అని ఉత్తమ్‌ను ప్రశ్నించారు. 2014లో మీ కారులో రూ.3 కోట్లు కాలిన కరెన్సీ నోట్లు లభించిన నేపథ్యంలో కార్ల తనిఖీ పట్ల మీకున్న ఆందోళనను అర్థం చేసుకోగలని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచారని, అనవసర రాజకీయాల కోసం కష్టపడి పనిచేసే పోలీసు అధికారుల మనోబలాన్ని దెబ్బతీయొద్దని హితువు పలికారు. అనంతరం దీనిపై తిట్లు, రోత, అసహ్యకర భాషను ప్రయోగించి రాజకీయంగా ఎదిగిన మీ లాంటి వ్యక్తుల నుంచి హితబోధలు తమకు అవసరం లేదని ఉత్తమ్‌ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ నోరు ఎలాంటిదో? మీ బావ హరీశ్‌రావు ఓ పోలీసును ఎలా చితకబాదారో? నువ్వు పోలీసులను ఎలా దుర్భాషలాడావో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని కేటీఆర్‌కు ఉత్తమ్‌ బదులిచ్చారు. ఉద్యమ కాలంలో ఓ పోలీసుపై హరీశ్‌రావు జరిపిన దాడి, పోలీసులను కేటీఆర్‌ దుర్భాషలాడిన రెండు ఘటనల వీడియోలను ఉత్తమ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ పై ఆరోపణలు చేశారు. దీనికి స్పందిస్తూ ఉద్యమంలో మీరెక్కడ ఉన్నారు? అని ఉత్తమ్‌ను కేటీఆర్‌ ప్రశ్నించారు.

అప్పటి సీఎంను అనుసరించడం, ప్రజాధనాన్ని దోచుకోవడంలో బిజీగా ఉన్నారన్న విషయాన్ని మరిచిపోయానని ఎద్దేవా చేశారు. తెలంగాణ పోరాటంలో తన పాత్ర పట్ల గర్వపడుతున్నానన్నారు. అప్పట్లో తాను తిట్టిన పోలీసులకు బహిరంగంగా క్షమాపణ చెప్పానని గుర్తు చేశారు. కారులో దొరికిన రూ.3 కోట్ల డబ్బు మీదేనని అంగీకరిస్తారా? అని ఉత్తమ్‌కు సవాలు విసిరారు. ‘మీ వాహనంలో రూ.3 కోట్లు లభించిన నేపథ్యంలో మీలాంటి నేరస్తులు ఎన్నికల్లో అక్రమాలు పునరావృతం చేస్తారని తెలిసీ కేంద్ర ఎన్నికల సంఘం మీ పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తుందని ఎలా అనుకుంటున్నారు’అని ఉత్తమ్‌ను కేటీఆర్‌ ప్రశ్నించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top