స్టేట్‌ కన్న రియల్‌ఎస్టేట్‌ మీదే చంద్రబాబుకు ప్రేమ | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు స్టేట్‌ కన్న రియల్‌ఎస్టేట్‌ మీదనే ప్రేమ

Published Sat, Dec 21 2019 2:42 PM

Pilli Subhash Chandra Bose Speech In Kakinada Over Capital Cities Of AP - Sakshi

సాక్షి, కాకినాడ: అధికార వికేంద్రీకరణతో ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాస్ చంద్రబోస్‌ శనివారం అన్నారు. జిల్లాలో నిర్వహించిన వైఎస్సార్‌ నేతన్న నేస్తం ఆవిష్కరణ మహోత్సవాలు కార్యక్రమంలో ఆయన పాలల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా రెండో రాజధానిని హైదరాబాదులో పెట్టాలని ఆనాడు డా. బి.ఆర్. అంబేద్కర్ చెప్పారని తెలిపారు.

బ్రిటిష్ ప్రభుత్వం, మొగలాయి రాజ్యం రెండు రాజధానులను ఏర్పాటు చేసుకున్నాయని సుభాస్‌చంద్రబోస్‌ గుర్తు చేశారు. గతంలో కర్నూలు, హైదరాబాదు విషయంలో రెండు పర్యాయాలు మన భావోద్వేగాలు బంగపడ్డాయని ఆయన తెలిపారు. సీఎం జగన్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఒక సామాజిక వర్గం వారే చేస్తున్నారని సుభాస్ చంద్రబోస్‌ విమర్శించారు. జీఎన్. రావు కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకుని సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన ప్రశంసించారు. ప్రజలు విజ్ఞనతో ఆలోచించాలని కోరుతున్నట్టు డీప్యూటీ సీఎం పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు.

అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు కేవలం ఒక వర్గం‌.. కొన్ని కుటుంబాలకు మేలు చేసే విధంగా రాజధానిని ఏర్పాటు చేయాలి ప్రయత్నం చేశారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో ఆ రాజధానిని పూర్తి చేయకుండా మసిపూసి మారేడుకాయ చేశారని కన్నబాబు దుయ్యబట్టారు. బహుబలి సినిమాలా గ్రాఫిక్స్ చేసి కథ నడిపించారని ఆయన ఎద్దేవా చేశారు. జీఎన్.రావు ఇచ్చిన నివేదిక మీద సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై సానుకూత లభిస్తోందని కన్నబాబు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత అందరు అధికార వికేంద్రీకరణ కోరుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

మూడు రాజధానులపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షిస్తున్నారని కన్నబాబు పేర్కొన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆమోదం లభిస్తోందని ఆయన తెలిపారు. చంద్రబాబు అనుకూల, రియల్ ఎస్టేట్ వర్గాలు చాల విచారం వ్యక్తం చేస్తున్నాయని కన్నబాబు మండిపడ్డారు. పేదల పొట్ట కొట్టి వారి పంటలు తగల బెట్టిన వారికే గొంతులో వెలక్కాయ పడినట్లయిందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన అమలులోకి వస్తే విశాఖపట్నం దేశంలోనే రెండవ ఆర్ధిక రాజధానిగా మారబోతుందని కన్నబాబు తెలిపారు. చంద్రబాబుకు రియల్ స్టేట్ మీద కన్న.. రియల్ ఎస్టేట్ మీదనే ప్రేమ అని ఎద్దేవా చేశారు. అమరావతి మీద ప్రేమ ఉంటే చంద్రబాబు హైదరాబాదులో ఎందుకు ఇళ్లు కట్టుకున్నాడని కన్నబాబు సూటిగా ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా తీరంలో అపార వనరులు ఉన్న నేపధ్యంలో పరిశ్రమల ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ను కోరతామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement