
సాక్షి, కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో బీజేపీ నాయకుడి ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరగడం కలకలం రేపింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సీఆర్ నందకుమార్ ఇంటిపై గుర్తుతెలియని దుండుగులు బుధవారం ఉదయం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు విసిరారు. దీంతో ఇంటి బయట ఉన్న ఆయన కారు ధ్వంసమైంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
అయితే, ఆ సమయంలో సీఆర్ నందకుమార్ ఇంట్లోనే నిద్రిస్తూ ఉన్నారు. ఈ ఘటన బీజేపీ శ్రేణుల్లో ఆందోళన కలుగజేసింది. ఈ ఘటన నేపథ్యంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళ్‌సాయి సౌందరరాజన్ నందకుమార్‌ను పరామర్శించవచ్చునని తెలుస్తోంది. ఇటీవల ద్రవిడ ఉద్యమ నేత రామస్వామి పెరియార్‌పై తమిళనాడు బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కోయంబత్తూరులోని బీజేపీ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగిన సంగతి తెలిసిందే.