మీరు ఆదేశించండి.. మేం అమలుచేస్తాం

People are maalik in democracy says rahul gandhi - Sakshi

ప్రజాస్వామ్యంలో నిజమైన యజమానులు ప్రజలే

జార్ఖండ్, రాజస్తాన్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్య

సిందేగా/జైపూర్‌: ప్రజాస్వామ్యంలో ప్రజలే నిజమైన యజమానులని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ అన్నారు. ప్రధాని మోదీ, ఇతర నాయకులంతా ప్రజల సేవకులేనన్నారు. ప్రజలు ఏం ఆదేశిస్తే అది చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందన్నారు. తాను ప్రజల మన్‌కీ బాత్‌(మనసులో మాట) వినేందుకే వచ్చానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ఖండ్, రాజస్తాన్‌లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న రాహుల్, ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.

ప్రతీ అంశాన్ని అమలుచేస్తాం..
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కనీస ఆదాయ భద్రత పథకం(న్యాయ్‌) తీసుకొస్తామని రాహుల్‌ తెలిపారు. జార్ఖండ్‌లోని కుంతి నియోజకవర్గం సిందేగాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నా మనసులోని మాట(మన్‌కీ బాత్‌) చెప్పేందుకు ఇక్కడకు రాలేదు. మీ మనసులోని మాటను వినేందుకు వచ్చా. మీరు చెప్పిన ప్రతీ అంశాన్ని అమలుచేస్తాం. ఓ విషయం మర్చిపోవద్దు. ప్రజాస్వామ్యంలో మీరే(ప్రజలు) నిజమైన యజమానులు. మీరు ఏది ఆదేశిస్తే మేం దాన్ని ఆచరిస్తాం. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, దేశంలోని ప్రతీఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల నగదు ఇలా ఇచ్చిన ఏ హామీలనూ మోదీ నిలబెట్టుకోలేదు. కుంతి నుంచి పోటీచేస్తున్న కాళీచరణ్‌ ముండాకు మీ అమూల్యమైన ఓటేసి గెలిపించండి’ అని కోరారు.

వాళ్లంతా మోదీకి యజమానులు..
ఆదివాసీల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్‌ స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వం రాగానే జార్ఖండ్‌లోని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం. కొత్త విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలను ఏర్పాటుచేస్తాం. కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి జల్‌–జంగల్‌–జమీన్‌(నీళ్లు–అడవి–భూమి)పై ఆదివాసీల హక్కులను పరిరక్షిస్తాం’ అని రాహుల్‌ తెలిపారు. అనంతరం రాజస్తాన్‌లోని ఛోములో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ ఓ 15 మంది పారిశ్రామికవేత్తలకు రూ.5.55 లక్షల కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా ఇచ్చేశారు.

ఈ 15 మంది పారిశ్రామికవేత్తలు నరేంద్ర మోదీకి యజమానులు. మాకు మాత్రం ప్రజలే యజమానులు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఈ 15 మంది పారిశ్రామికవేత్తలకు మాఫీచేసిన మొత్తాన్ని తిరిగివసూలు చేసి పేదల సంక్షేమానికి వినియోగిస్తాం. యువత ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మూడేళ్ల వరకూ ఎలాంటి ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా చేస్తాం’ అని పేర్కొన్నారు. తాను గత 60 రోజుల్లో 115 ర్యాలీల్లో పాల్గొన్నానని, దేశంలో భారీ మార్పు రాబోతోందని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top