పవన్‌కల్యాణ్‌ మాటల్లో బైటపడిన మూడు అంశాలు | Pawan Kalyan shows love on TDP govt | Sakshi
Sakshi News home page

అవగాహనలేమి..అధికారపక్షంపై ప్రేమ

Dec 9 2017 1:35 AM | Updated on Mar 22 2019 5:33 PM

Pawan Kalyan shows love on TDP govt - Sakshi

సాక్షి, అమరావతి: అవగాహన లేమి.. అధికారపార్టీని రక్షించాలన్న ఆరాటం.. సంబంధం ఉన్నా లేకున్నా వైఎస్సార్‌ను, వైఎస్‌ జగన్‌ను, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీని తప్పు బట్టాలన్న తపన... జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడలో శుక్రవారం వివిధ సమస్యలపై తనను కలసిన బాధితులతోనూ, పార్టీ కార్యకర్తలతోనూ జరిపిన సమావేశాలను పరిశీలిస్తే అడుగడుగునా ఈ మూడు అంశాలే కనిపిస్తున్నాయని విశ్లేషకులంటున్నారు. తమ సమస్యలు వివరిస్తూ ఏదో పరిష్కారం ప్రకటిస్తారని ఆశించిన బాధితులు పవన్‌ సమాధానాలు విని నిర్ఘాంతపోయారు. ఈ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించడం లేదని చెప్పుకుంటూ ఉంటే ఆయన సంబంధం లేని ఎవరెవరిపైనో నిందలు వేసేందుకు ప్రయత్నించడం చూసి బాధితులు అవాక్కయ్యారు. ఆయన  అవగాహన సరికాదని అర్ధం చేసుకున్న బాధితులు అసలు నిజాలను వివరించడంతో ఆ సమస్యలను సంపూర్ణంగా అధ్యయనం చేస్తానని చెప్పి పవన్‌ ముగించారు. 

1. వైఎస్సార్‌ను దోషిగా చిత్రీకరించే యత్నం..
విద్యుత్‌ ఒప్పంద కార్మికులు:  మమ్మల్ని రెగ్యులరైజ్‌ చేస్తామని చంద్రబాబు పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా హామీ ఇచ్చారు. 24వేల మందిమి ఉన్నాం. మమ్మల్ని గాలికొదిలేశారు.
పవన్‌కల్యాణ్‌: ఈ సమస్య 20 ఏళ్లుగా ఉంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దీనిని గురించి ఆయనను ఆడగలేదా?
విద్యుత్‌ ఒప్పంద కార్మికులు: వైఎస్‌ఆర్‌ 7,114 మందిని రెగ్యులరైజ్‌ చేశారు. 2009 ఎన్నికల సమయంలో అప్పటికి మిగిలి ఉన్న వారిని గురించి ఎన్నికలు అయిపోగానే చేస్తామ న్నారు. అయితే దురదృష్టవశాత్తు వైఎస్‌ఆర్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు.
పవన్‌కల్యాణ్‌: కాంట్రాక్టు  ఉద్యోగులను రెగ్యు లరైజ్‌ చేయడం అన్నదానిపై వివరంగా ఆధ్య యనం చేయాలి. ఇలాంటి అంశాలపై ప్రతి పక్షం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలి.
విద్యుత్‌ ఒప్పందకార్మికులు: గత అసెంబ్లీ సమావేశాలలో వైఎస్సార్‌సీపీ దీనిపై  ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 
పవన్‌కల్యాణ్‌: ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీ బహిష్కరించడం సరికాదు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో దీనిపై ఎందుకు మాట్లాడరు.?

2.  జగన్‌ అధికారంలోకి వచ్చినా చేయడట..
సీపీఎస్‌ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు: రాష్ట్రంలో 1,84,000 వేల మంది ఉద్యోగులు సీపీఎస్‌ పెన్షన్‌ విధానం వల్ల నష్టపోతున్నాం. పాత పెన్షన్‌ విధానం కొనసాగించమని కోరితే కేంద్ర పరిధిలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.  కేంద్రాన్ని అడిగితే రాష్ట్రానికి స్వేచ్ఛ ఇచ్చామని చెబుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. 
పవన్‌కల్యాణ్‌: ముఖ్యమంత్రి అయ్యాక చేస్తానంటూ ఆయన చెప్పే మాటలు విని విసిగిపోయాను.  జగన్‌ ముఖ్యమంత్రి అయినా కూడా చేయడు. ఆయన అధికారంలోకి వస్తే నేను చేశాను గానీ కేంద్రం ఒప్పుకోలేదంటాడు. ఈ సమస్యపై కేంద్రంలో ఉన్న వారితో మాట్లాడతా.
సీపీఎస్‌ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు: కేంద్ర చట్టాన్ని  రాష్ట్రాల ఇష్టం మేరకు అమలు చేసుకోవచ్చు. త్రిపుర, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో సీపీఎస్‌ పెన్షన్‌ విధానం లేదు. 
పవన్‌కల్యాణ్‌: త్రిపుర చిన్న రాష్ట్రం. దానికి నిధులు ఎక్కువ. ఉద్యోగులు తక్కువగా ఉంటారు. పశ్చిమ బెంగాల్‌లో ఎక్కువ కాలం కమ్యూనిస్టులు అధికారంలో ఉండడం వల్ల అక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. 2004 నుంచి ఈ సమస్య ఉన్నప్పుడు గత ప్రభుత్వం సమయంలో ఆందోళన చేయలేదా?

3. ఫాతిమా కాలేజీ సమస్య ఈ సర్కార్‌ హయాంలో కాదనుకున్నారట..
ఫాతిమా కాలేజీ విద్యార్ధులు: కాలేజీ యాజమాన్యం చేసిన పొరపాటుకు మా తప్పేమీ లేకపోయినా 2015 బ్యాచ్‌కు చెందిన వంద మంది విద్యార్ధులు రోడ్డున పడ్డాం. ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. (నంద్యాల ఉపఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ప్రసంగ వీడియోను పవన్‌కల్యాణ్‌ చూపుతూ) అన్యాయం జరిగిన విద్యార్ధులకు వేరొక కాలేజీలో ప్రవేశాలు కల్పించి న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ ఇప్పిస్తాం, చదివి మళ్లీ సీట్లు తెచ్చుకోమంటున్నారు.  ఫాతిమా కాలేజీ యాజమాన్యం, వైద్యారోగ్యశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ముగ్గురూ ఒక్కటయ్యారు. అన్యాయం జరిగిన విద్యార్థ్ధులకు వేరొక కాలేజీ ప్రవేశాలు కల్పించి న్యాయం చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ ఇప్పిస్తాం, చదవి మళ్లీ సీట్లు తెచ్చుకోమంటున్నారు. గతంలో మూడేళ్ల లాంగ్‌ టర్మ్‌ చదివి ఆ సీట్లు సంపాదించుకున్నాం. ఇప్పుడు లాంగ్‌ టర్మ్‌ సీటు రాకపోతే మా భవిష్యత్‌ ఏంటి? ఫాతిమా కాలేజీ యాజమాన్యం, వైద్యారోగ్యశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ముగ్గురూ ఒక్కటయ్యారు. ఫాతిమా కాలేజీ యాజమాన్యం కారణంగా  నష్టపోయిన మాపైనే కోర్టు కేసులు వేస్తున్నా యాజమాన్యంపై ప్రభుత్వం చిన్న చర్యా తీసుకోవడం లేదు. చంద్రబాబు ఈ విషయంలో చొరవచూపి ఎంసీఐకి లేఖ రాసి ఉంటే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. 
పవన్‌కల్యాణ్‌: ఇది గత ప్రభుత్వాల వారస్వతంగా వచ్చిన సమస్య అని ఇన్నాళ్లు అనుకున్నా. మీరు తిరిగి కాలేజీకి వెళ్తారు. ఎలా అన్నదానికి, నాకు కొంత సమయమివ్వండి. కేంద్రం ప్రత్యేక హోదా ఎలాగూ ఇవ్వలేకపోయింది. కనీసం వంద మంది విద్యార్ధులకు సీట్లు అయినా కేంద్రం ఇవ్వలేదా. మీరు డిల్లీ వెళ్ళి పోరాడడం కాదు కేంద్రాన్ని  అక్కడినుంచి ఇక్కడకు తీసుకొస్తా. ఈ సమస్యపై వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యతో మాట్లాడతా. ఇలా వివిధ సమస్యలపై తనను కలిసిన బాధితుల గోడు విన్న పవన్‌ కల్యాణ్‌  వారికి ఇచ్చిన సమాధానాలు చూస్తే ఆయన ఉద్దేశం ఏమిటో.. ఆయన ఎవరి తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడుతున్నారో తేలికగానే అర్ధమౌతున్నదని రాజకీయ విశ్లేషకులంటు న్నారు. ఒక విధంగా తన అవగాహనలేమి గురించి పవన్‌కల్యాణ్‌ పూర్తి స్పష్టత ఇచ్చారని వారంటున్నారు..  ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తమకు జరుగుతున్న అన్యాయాల గురించి బాధితులు గోడు వెళ్లబోసుకుం టుంటే ఆయన మాత్రం వైఎస్సార్‌పైనా, ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపైనా విమర్శలు చేశారు. ప్రభుత్వం తమకు మాట ఇచ్చి తప్పిందని బాధితులు స్పష్టంగా చెబుతున్నా ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనేందుకు పవన్‌ సాహసించకపోవడాన్ని బట్టి ఆయన పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement