‘ముజఫర్‌పూర్‌’ రేప్‌లు సిగ్గుచేటు

Opposition show of unity at RJD protest - Sakshi

ఢిల్లీలో విపక్షాల నిరసన

న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ వసతి గృహంలో బాలికలపై అత్యాచారాలు సిగ్గుచేటని విపక్షాలు ఖండించాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద శనివారం ఆర్జేడీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పలు పార్టీల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, సీపీఐ నాయకుడు డి.రాజా, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ నాయకుడు శరద్‌ యాదవ్‌ తదితరులు హాజరయ్యారు. బిహార్‌లో అధికార జేడీయూ–బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. ముజఫర్‌పూర్‌ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత బాలికలకు అండగా ఉంటామని రాహుల్‌ అన్నారు.

ప్రస్తుతం దేశమంతా ఒకవైపు, ఆర్‌ఎస్సెస్‌–బీజేపీ భావజాలం ఒకవైపు ఉన్నాయన్నారు. గత నాలుగేళ్లుగా జరుగుతున్న పరిణామాలను దేశం ఇష్టపడటం లేదని, ప్రజలు తలచుకుంటే ఎవరూ వారి ముందు నిలవలేరని అన్నారు. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను లక్ష్యంగా చేసుకున్న తేజస్వి యాదవ్‌ మాట్లాడుతూ..రేప్‌ ఘటనలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇలాంటి హేయమైన నేరాల్లో దోషులకు కఠిన శిక్ష విధించడానికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటుచేయాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అరాచకం రాజ్యమేలుతోందని ఏచూరి మండిపడ్డారు. ‘భేటీ బచావో’ నినాదం ‘సేవ్‌ భేటీ ఫ్రమ్‌ బీజేపీ’గా మారిందన్నారు. బాలికలకు బదులుగా బీజేపీ గోవులను కాపాడుతోందని శరద్‌ యాదవ్‌ ధ్వజమెత్తారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top