ట్రంప్‌ను పిలువకుంటే.. ‘టైమ్‌బాంబ్‌’ పేలినట్టే!

Obama to invited to the royal wedding - Sakshi

దౌత్యవివాదం రాజేస్తున్న ప్రిన్స్‌ హ్యారీ పెళ్లి వేడుక

త్వరలో జరగనున్న ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ల రాచరిక వివాహం బ్రిటన్‌, అమెరికా మధ్య దౌత్య వివాదానికి తెరతీసేలా కనిపిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను ఈ వేడుకకు ఆహ్వానించి.. ప్రస్తుత ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ను పిలువకపోతే.. ‘డిప్లమాటిక్‌ టైమ్‌బాంబ్‌’  బద్దలయ్యే అవకాశముందని నిపుణులు అంటున్నారు.

ట్రంప్‌ అధ్యక్షుడైన తర్వాత బ్రిటన్‌-అమెరికా దౌత్యబంధం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు ఎదురుకాకుండా రాచకుటుంబం రంగంలోకి దిగింది. హ్యారీ పెళ్లి సందర్భంగా వివాదం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పెళ్లిపీటలు ఎక్కబోతున్న ప్రిన్స్‌ హ్యారీ బరాక్‌ ఒబామాను స్నేహితుడిగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఆయనను పెళ్లికి అతిథిగా ఆహ్వానించే అవకాశముందని కథనాలు వచ్చాయి. అదే సమయంలో ఈ వివాహం బ్రిటన్‌ అధికారిక వేడుక కాకపోవడంతో ట్రంప్‌ను పిలిచే అవకాశం లేదని సన్నిహితులు తెలిపారు. అయితే, ఒబామాను పిలిచి తనను పిలువకపోవడం ట్రంప్‌ అవమానంగా భావించే అవకాశముందని, తనకు ఆహ్వానం అందని నేపథ్యంలో ఆయన తాజా బ్రిటన్‌ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా బ్రిటన్‌లో పర్యటించాలని గతంలో ట్రంప్‌ భావించారు. అయితే, సరిగ్గా ఇదే సమయంలో హ్యారీ పెళ్లి జరుగుతుండటం, తనకు ఆహ్వానం అందకపోవడం ట్రంప్‌ తలవంపులుగా భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఒబామాను ఈ పెళ్లికి ఆహ్వానిస్తే.. దౌత్యవివాదం మరింత తీవ్రమయ్యే అవకాశముందని, అందుకే ఒబామాను కూడా పిలువకూడదని నిర్ణయించినట్టు బ్రిటన్‌ రాయల్‌ ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top