ఉత్తరాంధ్రలో ఉరకలు..

North Andhra People Wants to YS Jagan Next Chief Minister - Sakshi

సాక్షి, ఎలక్షన్‌ డెస్క్‌ : ఉత్తరాంధ్ర వైఎస్‌ జగన్‌కు జై కొడుతోంది. ఐదేళ్లలో వివక్షకు, దోపిడీకి గురైన ఉత్తరాంధ్ర చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరుగుతూ.. తిరుగు బావుటా ఎగురవేయనుంది. ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్రను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదని దుయ్యబడుతున్నారు.

ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో వర్గాలను పెంచిపోషించిన టీడీపీ.. అవినీతి, అక్రమాలతో కల్లోలం సృష్టించింది. బీసీలు, గిరిజనుల ఇలాకా విజయనగరం జిల్లా రాజులు, పెత్తందారీల కబంధ హస్తాల్లో ఉక్కిరిబిక్కిరైంది. సిక్కోలు గుండెల్లో టీడీపీ రగిల్చిన అరాచక చిచ్చు ఇంకా భగ్గుమంటూనే ఉంది. వెరసి.. చంద్రబాబు ఐదేళ్ల పాలనను తలచుకుని ఉత్తరాంధ్ర బెంబేలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ‘నేను విన్నాను... నేను ఉన్నాను’ అంటూ వైఎస్‌ జగన్‌ ఇచ్చిన భరోసా ఉత్తరాంధ్రకు సాంత్వన కలిగిస్తోంది.

మరోవైపు వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టో ఇక్కడి ప్రజలకు భవిష్యత్‌పై ఆశలు రేపుతోంది. ఈసారి ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తామని ఉత్తరాంధ్ర ముక్తకంఠంతో నినదిస్తోంది. 34 అసెంబ్లీ, 5 లోక్‌సభ నియోజకవర్గాలతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించే ఉత్తరాంధ్ర ప్రస్తుత ఎన్నికల్లో కీలక నిర్ణయం తీసుకుంది. ‘రాజన్న బిడ్డ వైఎస్‌ జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దాం. కుళ్లు, కుతంత్రాలతో నిండిన రాజకీయాల్లో మార్పు తెద్దాం’ అంటూ రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్‌ పరిణామాలను సూచిస్తోంది. 

2009 ఫలితాలను మించి 
2009 ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాలు అండగా నిలిచాయి. విశాఖలో 15 నియోజకవర్గాలకు గాను 9చోట్ల వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిలిపిన అభ్యర్థులు గెలుపొందారు.  విజయనగరంలో 9 స్థానాలకు గాను 7చోట్ల, శ్రీకాకుళంలో 10 స్థానాలకు గాను 7 చోట్ల రాజశేఖరరెడ్డి తరఫు అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 34 స్థానాలు ఉండగా.. అప్పట్లో 23 మంది గెలిచారు. 5 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అన్నిచోట్లా రాజశేఖరరెడ్డి టీమ్‌ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ విజయఢంకా మోగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్‌  తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతగానో నమ్ముతున్నారని, తండ్రి స్ఫూర్తితో వైఎస్‌ జగన్‌ మరిన్ని పథకాలను అమలు చేసి రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

విశాఖలో అవినీతి కల్లోలం 

విశాఖపట్నం జిల్లాలో చంద్రబాబు ప్రభుత్వం సాగించిన అవినీతి వ్యవహారాలు కల్లోలం రేపాయి. ఇక్కడ పరిశ్రమలు, పర్యాటక రంగాన్ని సైతం ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు వైఫల్యం విశాఖపట్నానికి శాపంగా మారింది. నగరంలో మూడు భాగస్వామ్య సదస్సులు నిర్వహించి.. హడావుడి చేసినప్పటికీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు రాలేదు. విశాఖ నగరంలో టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, వెలగపూడి రామకృష్ణ తదితరులు రౌడీయిజాన్ని ప్రోత్సహించడంతో సామాన్యులు హడలెత్తిపోయారు.

మరోవైపు విశాఖ గ్రామీణ ప్రాంతంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు. తుమ్మపాల చక్కెర కర్మాగారం మూతపడింది. అనకాపల్లిలో బెల్లం పరిశ్రమ కుదేలైంది. మన్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ విశాఖ జిల్లాలో చంద్రబాబు సర్కారు తీరుపై ఎల్లెడలా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. వైఎస్‌ జగన్‌ పాదయాత్రతో జిల్లాలో రాజకీయ సమీకరణల్లో పెనుమార్పులు వచ్చాయి.

జిల్లాలో సాగు, సహకార రంగాలను ఆదుకుంటానని ఆయన మాట ఇచ్చారు. ప్రధానంగా ప్రత్యేక హోదా సాధనకు వైఎస్‌ జగన్‌ కడవరకూ కట్టుబడి ఉండటంపై విశాఖ వాసులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నగరానికి చెందిన యర్రం శ్రీనివాసరావు అనే బ్యాంకు రిటైర్డ్‌ మేనేజర్‌ మాట్లాడుతూ.. ‘మంత్రులు లోకేశ్, గంటా శ్రీనివాసరావు కలిసి ఏకంగా రూ.లక్ష కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడ్డారు’ అని వాస్తవ పరిస్థితిని వివరించగా.. కేఎస్‌ సంపత్‌ అనే ఇంజినీరింగ్‌ విద్యార్థి మాట్లాడుతూ.. ‘విశాఖపట్నం–భీమిలి మధ్య విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం తప్ప ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పలేదు’ అని కుండబద్దలు గొట్టారు. స్టీల్‌ ప్లాంట్‌ మాజీ ఉద్యోగి అప్పలస్వామి మాట్లాడుతూ.. ‘కేంద్రంలో నాలుగేళ్లు బీజేపీతో అధికారాన్ని పంచుకుని కూడా స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించలేకపోయారు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రత్యేక హోదా వస్తే విశాఖ జిల్లాకే అధిక ప్రయోజనం కలుగుతుందని రామచంద్రరావు అనే చార్టర్డ్‌ అకౌటెంట్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే.. వైఎస్‌ జగన్‌ను ఈసారి గెలిపించాలని భావిస్తున్నామని వారంతా స్పష్టం చేశారు. విశాఖ జిల్లా ఓటర్లలో అత్యధిక శాతం ఉన్న యువత ఏకపక్షంగా వైఎస్‌ జగన్‌కు మద్దతు పలకటం ప్రాధాన్యత సంతరించుకుంది. సహజంగానే విశాఖపట్నం జిల్లా మన్య ప్రాంతంలో ఫ్యాన్‌ గాలి హోరెత్తుతోంది. తాము వైఎస్సార్‌ సీపీ తప్ప మరో పార్టీ గురించి ఆలోచించడమే లేదని అనంతగిరి మండలానికి చెందిన రాం దొర అనే గిరిజన యువకుడు తేల్చిచెప్పారు.

జిల్లాలో ఎక్కడా క్షేత్రస్థాయి పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా లేవు. సంక్షేమ పథకాల అమలులో తీవ్ర వివక్ష కొనసాగింది. ఇలాంటి కారణాల వల్ల జిల్లాలో ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉండబోతోంది. భీమిలి, గాజువాక, చోడవరం, మాడుగుల, అరకు, పాడేరు, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి, పాయకరావుపేట, నర్సీపట్నం, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, విశాఖ నార్త్‌ నియోజకవర్గాల్లో ఫ్యాన్‌ గుర్తు విజయబావుటా ఎగురవేయటం తథ్యమని అనకాపల్లికి చెందిన నడిపిల్లి రాజు అనే కిళ్లీ కొట్టు యజమాని పేర్కొనడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. 

విజయనగరం.. వైఎస్సార్‌సీపీ స్వీప్‌

చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, సామాజికవర్గ సమీకరణలు విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా మారాయి. పూర్తిగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలతో కూడిన ఈ జిల్లాలో చంద్రబాబు పాలనపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విభజన హామీల్లో పేర్కొన్న గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఈ ఐదేళ్లలో ప్రారంభించనే లేదు. తోటపల్లి రిజర్వాయర్‌ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో నాలుగు నియోజకవర్గాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

జిల్లాకు చెందిన మంత్రి సహా ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. సామాన్యులకు అందుబాటులో ఉండనే ఉండరు. ఇదిలావుంటే.. ప్రస్తుత ఎన్నికల్లో రాజ కుటుంబాలు టీడీపీవైపు, సామాన్యులు, రైతు కుటుంబాలన్నీ వైఎస్సార్‌ సీపీ వైపు ఉండటం ఈ ఎన్నికలను ప్రభావితం చేయనుంది. 70 శాతం బీసీలున్న ఈ జిల్లాలో టీడీపీ తరఫున విజయనగరం, బొబ్బిలి, కురుపాం, మేరంగి రాజ కుటుంబాలకు టీడీపీ ఏకంగా 5 సీట్లు కేటాయించి.. వారికే పెద్దరికం అప్పగించింది.

వైఎస్సార్‌ సీపీ మాత్రం బీసీలకే పెద్దపీట వేయడం సర్వత్రా ప్రజామోదాన్ని పొందుతోంది. అందులోనూ విజయనగరం, బొబ్బిలి రాజులపై రైతు కుటుంబాలకు చెందిన నేతలను, కురుపాం రాజవంశీకుడు కిశోర్‌చంద్రదేవ్‌పై పోటీకి గిరిజన మహిళను అభ్యర్థిగా ఎంపిక చేయడం వైఎస్సార్‌ సీపీకి సానుకూలంగా మారింది. ‘జిల్లాలో బీసీలు 70శాతం ఉన్నాం. ఒకప్పుడు టీడీపీ రాజ కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే సీటు ఇచ్చేది. పోనిలే అనుకునేవాళ్లం. ఇప్పుడు ఏకంగా 5 సీట్లు ఇచ్చింది.

ఇదేం ప్రజాస్వామ్యం. అందుకే ఈసారి ఎన్నికల్లో టీడీపీని ఓడించి బీసీల ఆత్మగౌరవం ఏమిటో చూపిస్తాం’ అని కృష్ణారావు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు విమర్శించారు. జిల్లాలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాలైన తూర్పుకాపు, కొప్పల వెలమ సామాజిక వర్గాలు, గిరిజనులు పూర్తిగా వైఎస్సార్‌ సీపీకి మద్దతు పలుకుతున్నారు. విజయనగరానికి చెందిన పూడి వెంకటస్వామి అనే ప్రైవేటు ఉద్యోగి మాట్లాడుతూ.. ‘నవరత్నాల పథకాలతో అన్నివర్గాల ప్రజలకు మేలు చేసేందుకు ముందుకొస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఈసారి తప్పనిసరిగా ముఖ్యమంత్రి చేసేందుకు అందరూ కంకణం కట్టుకున్నారు’ అని చెప్పటాన్ని చూస్తే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో అవగతం అవుతుంది.

 చీపురుపల్లికి చెందిన చిరు వ్యాపారి చిన్నం వెంకటసూరి మాట్లాడుతూ.. ‘ఈ ప్రభుత్వం పేదలను ఏమాత్రం పట్టించుకోలేదు. నా తోటి వ్యాపారి గుండె జబ్బు బారిన పడితే.. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు పని చేయదని చెప్పారు. వైద్యానికి హైదరాబాద్‌ వెళ్లాలని, రూ.3 లక్షలపైనే ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. డబ్బుల్లేని పరిస్థితుల్లో మా కళ్లెదుటే ఆయన ప్రాణం పోయింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదోళ్లకు ఇలాంటి దుస్థితి రాలేదు’ అన్నాడు. పేదోళ్లను పట్టించుకోని ఈ ప్రభుత్వం ఇక ఉండకూడదని, రాజన్న రాజ్యం తిరిగి రావాలని వెంకటసూరి ఆకాంక్షించారు. జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో ఎవరిని కదిపినా ఇలాంటి మాటలే వినిపించాయి. 

ఆ రోజులు రావాలంటున్న సిక్కోలు 

ఐదేళ్లూ టీడీపీ సాగించిన అవినీతి పాలనతో జిల్లా వాసులు బెంబేలెత్తిపోయారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్సార్‌ సీపీని గెలిపించాలని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలోనే తొలి రిమ్స్‌ ఆసుపత్రి, వైద్య కళాశాలను శ్రీకాకుళం జిల్లాలో నెలకొల్పారు. వంశధార రెండో విడత పనులు చేపట్టారు.  జిల్లా అంతటా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారు. కాగా.. టీడీపీ పాలనలో జిల్లా అభివృద్ధిని పట్టించుకునేనాథుడే కరువయ్యాడు. మంత్రులు  అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు సహా టీడీపీ ఎమ్మెల్యేలు పోటీపడి మరీ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు.

అధికారులు, ఉద్యోగులను తీవ్రంగా వేధించారు. ఇసుక, మద్యం మాఫియాలు జిల్లాను హడలెత్తించాయి. అచ్చెన్నాయుడు, కూన రవి కుమార్, ఎమ్మెల్యే గౌతు శివాజీ అల్లుడు వెంకన్నచౌదరి తదితరుల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఈ ఎన్నికల్లోనూ అభ్యర్థిత్వం కట్టబెట్టడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ టీడీపీ విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి. కాగా, వైఎస్సార్‌ సీపీ అధినేత  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో నిర్వహించిన పాదయాత్ర ప్రజలకు భరోసా ఇచ్చింది.

వంశధార, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తిచేస్తామని, ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను తీరుస్తామని ఆయన ఇచ్చిన హామీల పట్ల ప్రజలు నమ్మకంతో ఉన్నారు. తండ్రి మాదిరిగానే జగన్‌ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సామాజికవర్గ సమీకరణలు కూడా వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఉండటంతో టీడీపీ అభ్యర్థులు ఎదురీదుతున్నారు. జిల్లాలో అత్యధికంగా ఉన్న కాళింగ సామాజిక వర్గానికి వైఎస్సార్‌ సీపీ ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్లను కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అభ్యర్థుల ఎంపికలో వైఎస్‌ జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అది కూడా పార్టీకి కలసివస్తోంది. రాజశేఖర్‌ (పేరు మార్చాం) అనే ప్రభుత్వ ఉద్యోగి మాట్లాడుతూ.. ‘2014లో  ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు వమ్ము చేశారు. తండ్రి రాజన్న స్ఫూర్తితో కుల, మత, వర్గ, పార్టీ రహితంగా పరిపాలన సాగించే వైఎస్‌ జగన్‌కు ఈసారి మద్దతు ఇస్తాం. ఆయనపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు’ అని చెప్పారు. ‘జిల్లాలో ఇంత అవినీతి, విచ్చలవిడితనాన్ని ఎన్నడూ చూడలేదు. టీడీపీని చిత్తుగా ఓడిస్తేగానీ పాలకులకు ప్రజలంటే భయం ఉండదు’ అని 70 ఏళ్ల టెక్కలికి చెందిన సింహాద్రి అప్పలనాయుడు వ్యాఖ్యానించటాన్ని చూస్తే టీడీపీపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అవగతం చేసుకోవచ్చు. జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చెర్ల, నరసన్నపేట, రాజాం, పాలకొండ ఎక్కడ చూసినా టీడీపీకి వ్యతిరేక పవనాలే కనిపిస్తున్నాయి.  

 – వడ్డాది శ్రీనివాస్,  సాక్షి, అమరావతి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top