నితీశ్‌పై విషం కక్కిన లాలూ తనయుడు

Nitish Kumar Not Allowed To Our Home, Says Tej Pratap Yadav - Sakshi

కూటమిలోకి కాదు.. ఇంట్లోకి కూడా రానివ్వం : తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌

పట్నా : ఎన్డీఏ కూటమిలో బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ సంతోషంగా లేరని, ఆయనను మహాకూటమిలోకి కొందరు కాంగ్రెస్‌ నేతలు పదే పదే ఆహ్వానిస్తున్నారని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ సీఎం నితీశ్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మా ఇంట్లోకి నితీశ్‌ చాచాకు అనుమతిలేదని బోర్డు పెట్టాలనుకున్న మేం మహా కూటమిలోకి బిహార్‌ సీఎంను ఎలా ఆహ్వానిస్తామనుకుంటున్నారని ప్రశ్నించారు. 

పట్నాలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ది 10, సర్క్యూలర్‌ రోడ్డులో ఉన్న తమ ఇంట్లోకి నితీశ్‌ను అడుగు పెట్టనిచ్చేది లేదన్నారు. మాజీ సీఎం, లాలూ భార్య రబ్రీదేవికి కేటాయించిన ఆ ఇంట్లో కుటుంబం మొత్తం నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. మహాకూటమిలోకి నితీశ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరోసారి చేర్చుకునేది లేదని లాలూ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్‌ ఇటీవల స్పష్టం చేయగా.. తేజ్‌ ప్రతాప్‌ సైతం అదే మాటపై ఉన్నారు. 

సీఎం నితీశ్‌ మహాకూటమిలో చేరాలనుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని జూన్‌ 17న ఏఐసీసీ బిహార్‌ కార్యదర్శి శక్తి సింగ్‌ గోహిల్‌ వ్యాఖ్యానించారు. మహాకూటమిలోకి నితీశ్‌ తిరిగి రానున్నారన్న వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో లాలూ తనయులు అందుకు ససేమిరా అంటున్నారు. కాగా, 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌, హిందూస్తానీ ఆవామ్‌ మోర్చా(సెక్యూలర్‌)ల కూటమి అధికారంలోకి వచ్చింది. గతేడాది జూలై మహాకూటమి నుంచి బయటకు వచ్చిన నితీశ్‌ బీజేపీతో జతకట్టి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. 

   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top