నిఖిల్‌ కుమారస్వామి వీడియో హల్‌చల్‌!!

Nikhil Kumaraswamy Comments About Assembly Election - Sakshi

బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం మరోసారి ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గానూ 25 సీట్లు గెలుచుకున్న బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దిగ్గజ నేతలు సహా జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ కూడా దారుణ ఓటమి చవిచూశారు. తన కుమారుడు నిఖిల్‌ను రంగంలోకి దింపిన సీఎం కుమారస్వామికి కూడా చేదు అనుభవమే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఓటమి గల కారణాల విశ్లేషణలో భాగంగా జేడీఎస్‌-కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో నిఖిల్‌ కుమారస్వామి జేడీఎస్‌ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి..
‘ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు. సిద్ధంగా ఉండండి. వాటి కోసం ఇప్పటి నుంచే మనం కసరత్తు మొదలుపెట్టాలి. అలసత్వం పనికి రాదు. వచ్చే నెల నుంచి కార్యాచరణ ప్రారంభించాలి. ఏడాదిలోపే లేదా మరో రెండు, మూడేళ్ల తర్వాత ఎన్నికలు రావొచ్చు. జేడీఎస్‌ కార్యకర్తలంతా ఇందుకు సన్నద్ధంగా ఉండాలి’ అని నిఖిల్‌ కుమారస్వామి తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రెండురోజుల క్రితం మండ్యలో కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సునీల్‌ గౌడ అనే కార్యకర్త వాట్సాప్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోలో ఉన్నది నిఖిల్‌ గొంతేనా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు.

ఇక జేడీఎస్‌ రాష్ట్ర చీఫ్‌గా ఉన్న ఏహెచ్‌ విశ్వనాథ్‌ రాజీనామ చేసిన అనంతరం నిఖిల్‌ ఈవిధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే నిఖిల్‌ వారితో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. కాగా మండ్య నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన నిఖిల్‌.. స్వతంత్ర అభ్యర్థి సుమలతా అంబరీష్‌ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top