డిప్యూటీ సీఎంపై వీడని ఉత్కంఠ

NCP Not Decide Who Is Deputy CM Of Maharashtra - Sakshi

డిప్యూటీ సీఎం పదవి కోసం పోటాపోటీ

నువ్వా నేనా అంటున్న జయంత్‌, అజిత్‌

శరద్‌ నిర్ణయంపై ఉత్కంఠ

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలో నూతన ప్రభుత్వంలో కొలువుతీరింది. ఠాక్రేతో పాటు మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి ఒప్పందంలో భాగంగా అసెంబ్లీ స్పీకర్‌ పదవి కాంగ్రెస్‌కు, డిప్యూటీ సీఎం పదవి ఎన్సీపీకి దక్కనున్నాయి. అయితే ఎన్సీపీ తరఫును ఆ పదవిని ఎవరు స్వీకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్సీపీ నుంచి చగన్‌ భుజ్జల్‌, జయంత్‌ పాటిల్‌లు ఇదివరకే మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో పార్టీపై తిరుగుబాటు చేసి.. తిరిగి సొంత గూటికే చేరుకున్న నాయకుడు అజిత్‌ పవార్‌ పరిస్థితి పార్టీలో ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఎన్సీపీకి ఎదురుతిరిగి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన ఆయన.. తన వర్గం ఎమ్మెల్యేల అండ లేకపోవడం, పవార్‌ కుటుంబసభ్యులు ఒత్తిడి తేవడంతో తిరిగి సొంత గూటికే చేరారు. చేసిన తప్పు ఒప్పుకున్నారు. మళ్లీ సొంతగూటికి చేరిన అబ్బాయిని బాబాయ్‌ శరద్‌ పవార్‌ కూడా క్షమించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఠాక్రే ప్రభుత్వంలో అజిత్‌కు చోటుదక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్సీపీలో అజిత్‌ను అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. వీటన్నిటిని గమనించే.. శరద్‌ ఇప్పటి వరకు అజిత్‌పై ఎలాంటి చర్యలు తీసుకుకోలేదు.

అయితే జయంత్‌ పాటిల్‌ను కాదని డిప్యూటీ సీఎం పదవిని ఆయనకు అప్పగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై శనివారం జయంత్‌ పాటిల్‌ స్పందిస్తూ.. డిప్యూటీ సీఎం పదవి ఎన్సీపీకే దక్కినా ఆ పదవిని ఎవరు చేపడతారు అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉందన్నారు. దీనిపై పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌ తుది నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. మరోవైపు పదవి కోసం అజిత్‌ పవార్‌ రహస్య మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తన కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు పార్టీలోకి తిరిగి వచ్చని అజిత్‌.. వారితోనే పదవి కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌ 22 తరువాత అజిత్‌ ఆ పదవిని చేపడతారని తెలిసింది. అయితే పార్టీపై తిరుగుబాటు చేసిన అజిత్‌ను శరద్‌ మరోసారి నమ్ముతారా లేదా అనేది వేచిచూడాలి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top