మళ్లీ బీజేపీలోకి వెళ్లరు.. అవన్నీ వదంతులు

Navjot Kaur Sidhu Denies Rumour About Sidhu Next Move - Sakshi

చండీగఢ్‌‌: మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మళ్లీ బీజేపీలో చేరతారని వస్తున్న వార్తలను ఆయన సతీమణి నవజ్యోత్‌ కౌర్‌ తోసిపుచ్చారు. ఇవి వదంతులు మాత్రమే అంటూ కొట్టిపారేశారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఇ​క నుంచి సామాజిక కార్యకర్తను మాత్రమే అంటూ కౌర్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకి వచ్చిన కౌర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తన శాఖను మార్చడంతో జూలైలో మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య దూరం పెరిగింది.

అయితే అమరీందర్‌తో తమకు ఎటువంటి విభేదాలు లేవని కౌర్‌ తెలిపారు. కాంగ్రెస్‌లో ఉన్నవారే వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి గ్రూపులు పెట్టలేదని, తన భర్తకు ప్రచార యావ లేదన్నారు. అమృత్‌సర్‌ ఈస్ట్‌ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా సిద్ధూ సేవలు కొనసాగిస్తారని చెప్పారు. ఉప ఎన్నికల్లో సిద్ధూ ఎందుకు ప్రచారం చేయలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు. తాను మళ్లీ బీజేపీకి వెళతానని వస్తున్న వార్తలపై నవజ్యోత్‌ సిద్ధూ ఇప్పటివరకు స్పందించలేదు.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top