వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బాబు యూటర్న్‌

Narendra Modi Speech On No Confidence Motion In Lok Sabha About Special Status For AP - Sakshi

హోదా వద్దు ప్యాకేజీ కావాలని చంద్రబాబే అడిగారు

ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు  

కేంద్రానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలిపారు  

ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి ఆయనకు హోదా గుర్తుకొచ్చింది

పచ్చి అవకాశవాద రాజకీయాన్ని ఆంధ్ర ప్రజలు గమనిస్తున్నారు

వైఎస్సార్‌సీపీ ఉచ్చులో బాబు చిక్కుకున్నారు

అభివృద్ధిపై తెలంగాణ దృష్టి పెడితే.. బాబు ఆలోచన గొడవలపైనే

విభజన చట్టంలోని హామీలు, ప్యాకేజీ అమలుకు కృషి  

ఏపీ రాజధాని నిర్మాణం, రైతుల సమస్యలపరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం

  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన ప్రధాని మోదీ

2014 ఎన్నికల తరువాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ మధ్య ప్రతిసారీ సమస్యలు వస్తుండేవి. కొన్నిసార్లు గవర్నర్, కొన్నిసార్లు హోంమంత్రి, నేను కూర్చొని రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరిం చేందుకు కృషి చేసేవాళ్లం. కేసీఆర్‌ కొంత మెచ్యూరిటీ చూపించారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో మునిగిపోయింది. ఏపీలో సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావడం లేదు. ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అంగీకారంతోనే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు కూడా తెలిపారు. కానీ, ఇప్పుడు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యూటర్న్‌ తీసుకున్నారు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..  

‘‘వాజ్‌పేయి హయాంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు, గొడవలు లేవు. అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకొని ఎవరిదారి వారు చూసుకున్నారు. మూడు రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాయి. అయితే, యూపీయే ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా సభ ఆర్డర్‌లో లేకపోయినా పార్లమెంట్‌ తలుపులు మూసి రెండు రాష్ట్రాలుగా విభజన చేసింది. గల్లా జయదేవ్‌ చెప్పినట్టు నేను ఆనాడు చెప్పా.

తెలుగు మా తల్లి.. తెలుగు స్ఫూర్తి దెబ్బతినకుండా చూడాలని ఆనాడే అన్నాను. కాంగ్రెస్‌ పార్టీ బిడ్డను రక్షించి, తల్లిని చంపేసింది. మనం ఇద్దరినీ రక్షించుకోవాలని చెప్పా. తెలుగు స్ఫూర్తిని రక్షించాలి. ఇప్పటికీ నేను ఇదే నమ్ముతాను. 2014లో కాంగ్రెస్‌ పార్టీ ఒక రాష్ట్రం పోతే మరో రాష్ట్రంలో మనుగడ సాధించవచ్చని అనుకుంది. కానీ, ఆ పార్టీకి రెండూ దక్కలేదు. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైనవారు. కాంగ్రెస్‌ గతంలో భారత్‌–పాకిస్తాన్‌ను విడదీసింది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం కాలేదు. అలాగే ఏపీ, తెలంగాణను విభజించింది.

ఆ రాష్ట్రాల సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. 2014 ఎన్నికల తరువాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ మధ్య ప్రతిసారి సమస్యలు వస్తుండేవి. కొన్నిసార్లు గవర్నర్, కొన్నిసార్లు హోంమంత్రి, నేను కూర్చొని రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కారించేందకు కృషి చేసేవాళ్లం. కేసీఆర్‌ కొంత మెచ్యూరిటీ చూపించారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో మునిగిపోయింది. ఏపీలో సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావడం లేదు. ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎన్డీయే ప్రభుత్వం హమీ ఇచ్చింది. ఇప్పటికీ మేం దానికి కట్టుబడి ఉన్నాం.  
 

ఏపీ ప్రజలకు విశ్వాసం కల్పిస్తున్నా...  
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయాం. అందుకే ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం. ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సభ్యుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బాగుందని అన్నారు. 2016 సెప్టెంబర్‌లో ప్యాకేజీ ప్రకటించాం. అది కూడా చంద్రబాబు అంగీకారంతోనే. ఈ ప్యాకేజీపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఆర్థిక మంత్రిని అభినందిస్తూ తీర్మానం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని, ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది. కానీ, చివరికి చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యూటర్న్‌ తీసుకున్నారు.

చంద్రబాబు ఎన్డీయే నుంచి వైదొలిగే ముందు నేను ఆయనకు ఫోన్‌ చేసి చెప్పాను. మీరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహంలో చిక్కుకుంటున్నారని చెప్పాను. ఈ వ్యూహంలో చిక్కుకుంటే మనుగడ సాధించలేరని కూడా తెలిపాను. ఈ పరిణామాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గమనిస్తున్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి, రైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చేయాల్సిందంతా చేస్తాం’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘‘ఒక రాష్ట్రానికి రాయితీలు ఇస్తే మరో రాష్ట్రంపై ప్రభావం పడుతుంది. ఇలా ఇస్తే రాష్ట్రాల మధ్య అసమానత ఏర్పడుతుందని మూడేళ్ల క్రితం కాంగ్రెస్‌ ఎంపీ వీరప్ప మొయిలీ ఇదే సభలో అన్నారు. ఇది చాలా పెద్ద అంశమని పేర్కొన్నారు. మీరు కేవలం ఆర్బిట్రేటర్‌ మాత్రమేనని మొయిలీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నేను విశ్వాసం కల్పిస్తున్నాను. కేంద్ర సర్కారు ఏపీ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. ఏపీకి అండగా ఉంటాం’’ అని మోదీ ఉద్ఘాటించారు.  
 
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని కేశినేని నాని  
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌కు(నాని) లోక్‌సభలో ప్రధానమంత్రి జవాబు అనంతరం మాట్లాడేందుకు అవకాశం రాగా ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. కేంద్రం చేసిన వాదనలను తిప్పికొట్టేందుకు ప్రయత్నించాల్సి ఉండగా.. కేవలం విమర్శలతో సరిపెట్టారు. దీంతో సభాపతి వెంటనే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ ప్రక్రియను ప్రారంభించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top