
న్యూఢిల్లీ: ‘కర్ణాటక గవర్నర్ కృతనిశ్చయంతో భారత సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఆయన్ను వెంటనే రీకాల్ చేయాల్సిందిగా రాష్ట్రపతిని కోరాలని ప్రధానికి విజ్ఞప్తి చేశాను’ అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌ను మోదీ 2011లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. అప్పటి కర్ణాటక గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్‌ను విమర్శిస్తూ మోదీ చేసిన ఈ ట్వీట్‌ను కాంగ్రెస్ పార్టీ గురువారం రీట్వీట్ చేసింది. కర్ణాటక గవర్నర్‌ను రీకాల్ చేయాలన్న మోదీ వ్యాఖ్యలకు తాము కూడా అంగీకరిస్తున్నట్లు వ్యంగ్యంగా స్పందించింది. కర్ణాటక గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ 2011, మే 19న మోదీ ఈ ట్వీట్ చేశారు.