సీఎం పదవే నా లక్ష్యం : రేవంత్‌ రెడ్డి

My Aim Is Become Chief Minister : Revanth Reddy - Sakshi

  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇచ్చినా వద్దని రాహుల్‌కు లేఖ రాస్తా

  పార్టీలోకి రమ్మన్నప్పుడు ఎన్నో హామీలిచ్చారు

సాక్షి, హైదరాబాద్‌: కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దాదాపు ఆరునెలల తర్వాత తన మనసులో మాట బయటపెట్టారు. కాంగ్రెస్‌ తనను వాడుకుంటే సొమ్ము చేసి పెడతానని, లేదంటే ఆ పార్టీకి మన్నే మిగులుతుందని వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘నన్ను పార్టీలోకి రమ్మన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ దూతలు ఎన్నో హామీలిచ్చారు. ఆ హామీలన్నీ వారికి తెలుసు. నా పనితీరు తెలిసి కూడా రాష్ట్ర టీం లీడర్‌ సరిగా వాడుకోవడం లేదు.

ఆయనకు సలహాలిచ్చే వారు సరిగా లేరు. నాకు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇచ్చినా తీసుకోను. ఆ పదవి వద్దని రాహుల్‌ గాంధీకి లేఖ రాస్తా. నా హోదాకు తగిన పదవిని ఆశిస్తున్నాను. ఎప్పటికైనా నా లక్ష్యం సీఎం కుర్చీనే’’ అని అన్నారు.

తాను మంత్రి పదవి ఇచ్చినా తీసుకోనని, కొన్నేళ్ల తర్వాతయినా సీఎం అవుతానని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ల శాసనసభ్యత్వాల రద్దుకు నిరసనగా గాంధీభవన్‌లో 48 గంటల దీక్ష చేపట్టాలని తానే సలహా ఇచ్చినట్లు చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపుదారులు వేరే పార్టీ వ్యక్తికి ఓటు వేసినా కాంగ్రెస్‌ నాయకత్వం కోర్టును ఆశ్రయించడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. గతంలో చాలా మంది ప్రలోభాలు గురిచేసినా తాను లొంగలేదని, బీజేపీ చీఫ్‌ అమిత్‌షా ఎన్నో ఆఫర్లు ఇచ్చినా వదులుకున్నానని చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top