
సాక్షి, ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయన్ని తెలియజేసేందుకు ఢిల్లీ వెళ్తున్నామని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఈ నెల 5న ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేపడుతున్న నేపథ్యంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో పోరాడుతామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై ఎంపీ మేకపాటి నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి చంద్రబాబు చాలా అన్యాయం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరి తమకు అర్థం కావడం లేదన్నారు.
చంద్రబాబు రాష్ట్ర ప్రజలను వంచించారని మండిపడ్డారు. మార్చి 5 నుంచి ఏప్రిల్ వరకు పార్లమెంట్‌లో పోరాడుతామని ఆయన తెలిపారు. కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం కూడా పెడతామని స్పష్టం చేశారు. దీనికి ఎవరు సహకరిస్తారో.. ఎవరు సహకరించరో చూస్తామని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్లో నిలదీస్తామని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసేంతవరకు అసెంబ్లీ సమావేశాలను బాయ్‌కాట్ చేయనున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎంపీ మేకపాటి ధ్వజమెత్తారు.