మీ ముందుకొస్తున్న జగన్‌ను ఆశీర్వదించండి

MP Mekapati appeal to the public about Ys Jagan - Sakshi

ప్రజలకు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎంపీ మేకపాటి విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు మంటగలుపుతున్నారని.. ఆయన కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని రక్షించాల్సిన అవసరముందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం పాదయాత్ర ద్వారా ప్రజల ముందుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను అందరూ ఆశీర్వదించాలని కోరారు. జగన్‌ పాదయాత్రను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఈ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు, మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజాతో కలసి ఆయన మీడియాకు వెల్లడించారు. 150 రోజులకు పైగా జరిగే పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ 3,000 కిలోమీటర్లు నడుస్తారని చెప్పారు.

120 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. మిగిలిన 55 నియోజకవర్గాల్లో ఆ తర్వాత జగన్‌ బస్సు యాత్ర నిర్వహిస్తారని చెప్పారు. టీడీపీకి ఎంత పట్టున్న గ్రామంలోనైనా సరే వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరేలా ప్రణాళికలు రూపొందించాలని సూచనలు వచ్చినట్లు తెలిపారు. కాగా, త్వరలో ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగబోతున్నందున.. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. దొంగ ఓట్లు చేర్పించుకోవడంలో టీడీపీ నాయకులు సిద్ధహస్తులు కనుక.. అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. ఇదిలాఉండగా, రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న తపనతో వైఎస్‌ జగన్‌ ఉన్నారని.. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగానే జగన్‌ కూడా రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారని మేకపాటి అన్నారు. దేశం మొత్తం మెచ్చేలా వైఎస్‌ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికలను డబ్బుమయం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.   

ప్రత్యేక హోదా వస్తుందంటే ఇప్పుడే రాజీనామా..: రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందంటే ఇప్పటికిప్పుడే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఎంపీ మేకపాటి విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్‌ అంటే.. దాన్ని టీడీపీ, కాంగ్రెస్‌లు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు రాజీనామాలు చేస్తే ప్రయోజనమేమిటని ఆయన ప్రశ్నించారు. రోజా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి తప్పించుకునేందుకు.. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top