బెడ్‌ టీ లేట్‌గా ఇచ్చారు..అందుకే..

Moon Moon Sen Says She Was Unaware Of Asansol Violence - Sakshi

కోల్‌కతా : అతడి పేరెత్తితే మీతో అసలు మాట్లాడే ప్రసక్తే లేదంటూ అనసోల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి, బెంగాల్‌ నటి మున్‌మున్‌ సేన్‌ మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. టీఎంసీ, బీజేపీ, వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు వారిని చెదరగొడుతున్నాయి. ఈ ఘటనల్లో భాగంగా కేంద్ర మంత్రి, అనసోల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బాబుల్‌ సుప్రియో కారుపై కొంతమంది దాడి చేశారు. అయితే తనపై దాడి చేసింది టీఎంసీ కార్యకర్తలే అని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై స్పందించాల్సిందిగా సుప్రియో ప్రత్యర్థి అభ్యర్థి మున్‌మున్‌ సేన్‌ను కోరగా.. ‘ అసలు ఆ ఘటన గురించి నాకేం తెలియదు. బెడ్‌ టీ లేట్‌గా ఇచ్చిన కారణంగా నేను ఈరోజు చాలా ఆలస్యంగా నిద్రలేచాను. ఇక దీని గురించి నేనేం మాట్లాడను. నిజంగా ఈ విషయం గురించి అస్సలు తెలియదు’అని వ్యాఖ్యానించారు.

విజయం నాదే..
గత ఎన్నికల్లో బంకూర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మున్‌ మున్‌ సేన్‌.. అపార అనుభవం ఉన్న వామపక్ష అభ్యర్థిని ఓడించారు. అయితే ఈసారి అనసోల్‌ నుంచి బరిలోకి దిగిన ఆమె.. ప్రస్తుత ఎన్నికల్లో కూడా తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్‌ గెలిచి తీరుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో అని పేర్కొన్నారు. ఇక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న హింస గురించి ప్రశ్నించగా.. ‘ కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న సమయంలో మీరు చాలా చిన్నవాళ్లనుకుంటా. ఒక్క బెంగాల్‌ మాత్రమే కాదు భారతదేశం మొత్తంలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top