ఇవేమి తిప్పలు స్టాలిన్‌ బాబు!

MK Stalin Comments on Hindu Religion - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకే) నాయకులు అవకాశం దొరికినప్పుడల్లా తాము హిందూ వ్యతిరేకులం కాదని, మత వ్యతిరేకులం అస్సలు కాదని పదే పదే చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఏప్రిల్‌ 9వ తేదీన దక్షిణ తమిళనాడులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తమది హిందూ వ్యతిరేక పార్టీ కాదని, హిందూయిజం ఒక్క భారతీయ జనతా పార్టీ సొత్తు కాదని అన్నారు. ఒక దశలో ఆయన డీఎంకే హిందూత్వ పార్టీ కాకపోతే డీఎంకేలో ఉన్న వారు ఎవరని ఆయన ప్రశ్నించారు. అసలు ఆయన ఎందుకు పదే పదే హిందూ వ్యతిరేకులం కాదని చెప్పుకోవాల్సి వస్తోంది? అందుకు దారితీసిన కారణాలు ఏమిటీ?

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేకు మద్దతిస్తున్న ‘ద్రావిడార్‌ కళగం’ అధ్యక్షుడు కే. వీరమణి గత మార్చి 27వ తేదీన ఓ సభలో మాట్లాడుతూ.. తమిళనాడులో సంచలనం సృష్టించిన ‘పొలాచ్చి సెక్స్‌ కుంభకోణం’ కేసు నిందితులను హిందువులు ఆరాధించే శ్రీకష్ణుడితో పోల్చారు. అందుకు హిందూ మక్కల్‌ కాట్చి అనే పార్టీ ఏప్రిల్‌ నాలుగో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి బీజేపీ, పాలకపక్ష  ఏఐఏడీఎంకే..  డీఎంకే, ద్రావిడార్‌ కళగంలు హిందూ వ్యతిరేకులంటూ విమర్శిస్తూ వస్తున్నాయి. ఈవీ రామస్వామి పెరియార్‌ 1920లో ఓ సామాజిక ఉద్యమంలో భాగంగా ద్రావిడార్‌ కళగంను ఏర్పాటు చేశారు. డీఎంకేగానీ, అన్నా ఏఐఏడీఎంకేగానీ ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చాయి. హిందువులను, హిందువుల ఆచారాలను విమర్శిస్తూనే ఈ రెండు ద్రావిడ పార్టీలు ఎదిగాయి.

డీఎంకే నాయకుడు, స్టాలిన్‌ తండ్రి ఎం. కరుణానిధి నాస్తికుడు. ఏ రోజున గుళ్లూ గోపురాలు దర్శించలేదు. నాస్తికుడిగానే ఐదుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. తూత్తుకుడి నుంచి డీఎంకే అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేస్తున్న స్టాలిన్‌ సోదరి కనిమోళి ఎన్నికల ప్రచారంలో భాగంగా గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారు. పైగా తండ్రి కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయాల్లో పలు మత కార్యక్రమాలు జరిగేవని చెబుతున్నారు. హిందు వ్యతిరేకులు అన్న ముద్ర పడితే ఎక్కడ ఓట్లు రాలవేమోనన్న భయం పట్టుకున్నది వారికి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమంటే ఇదేనేమో!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top