బాబు లేఖతో కాళేశ్వరం ఆగుతుందా?

Minister Harish Rao Fires On AP CM Chandrababu Naidu - Sakshi

నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు

నంగునూరు(సిద్దిపేట): కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రాకు అన్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు ఢిల్లీకి లేఖ రాస్తే ప్రాజెక్టు ఆగుతుందా అని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎవ్వరు అడ్డుపడ్డా సంవత్సరంలోపు ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు సాగు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ 954 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని ఆంధ్ర నాయకులు శ్రీకృష్ణ కమిటీకి అఫిడవిట్‌ ఇచ్చారన్నారు. వృథాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గోదావరి నదిపై ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు ఢిల్లీకి లేఖ రాయడం ఎంత వరకు సమంజసమన్నారు. మా నీళ్లు మాకు కావాలనే తెలంగాణ తెచ్చుకున్నామని రాష్ట్రం హక్కును కాలరాస్తే ఊరుకునేదిలేదని అన్నారు. తెలంగాణ ఆపేందుకు కాళ్లు కాలిన పిల్లిలా ఢిల్లీకి తిరిగిన చంద్రబాబు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు లేఖలమీద లేఖలు రాస్తున్నాడన్నారు.  
సంవత్సరంలోపు పూర్తి..
కోర్టు కేసులతో కాంగ్రెసోళ్లు, లేఖలతో చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని చూస్తున్నారని, అయితే ఎవరు అడ్డుపడ్డా సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి హరీశ్‌ స్పష్టం చేశారు. కాలువల నిర్మాణానికి రైతులు భూములు ఇవ్వకుండా కాంగ్రెసోళ్లు రాష్ట్రం లోపల కొట్లాడుతుంటే, టీడీపీ బయట నుంచి కొట్లాడుతోందని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ ఉనికి కోల్పోతామని వారు భయపడుతున్నారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top