మౌనిక కుటుంబానికి ప్రభుత్వం రూ.50లక్షల ఇవ్వాలి

Marri shashidhar Reddy Slams KCR Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెట్రో పిల్లర్‌ కారణంగా దుర్మరణం పాలైన మౌనిక కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఇవ్వాలని, దీనికి కారణమైన ఎల్ అండ్‌ టీపై మర్డర్‌ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నిన్న అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో కాంక్రీట్‌ పడి చనిపోయిన మౌనిక కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి ఎవరూ సందర్శించి ఓదార్చకపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించిన తీరును తీవ్రంగా ఖండించారు. ‘నాణ్యత లోపం వల్ల ఈ సంఘటన జరిగింది. మెట్రో స్టేషన్‌ నిర్మించి రెండేళ్లు కాకుండానే ఇలా జరిగింది. ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనని నగరవాసులు ఆందోళనలో ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టత ఇవ్వాలి. మెట్రో రైల్‌ని ప్రధాని మోదీ ప్రారంభించిన రెండేళ్లలోనే ఇలా జరిగింది. దీనిపై విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలి. గతంలో పెచ్చులు ఊడిపోయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కనుకే నిన్న ఒక అమ్మాయి చనిపోయింది. ప్రభుత్వం వెంటనే మౌనిక కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి​’  అని శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

(చదవండి : మెట్రో పిల్లర్‌ కాదు.. కిల్లర్‌)

ఉద్యోగులను కుక్కలతో పోల్చుడం సిగ్గు చేటు : రాములు నాయక్‌
అసెంబ్లీలో బట్టి విక్రమార్కపై సీఎం కేసీఆర్‌ మాట్లాడిన తీరును మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్‌ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఉద్యోగులను కుక్కలతో పోల్చడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కృషి చేసినప్పుడేమో ఉద్యోగులు దేవుళ్లలా కనిపించారు.. ఇప్పుడేమో దెయ్యాల కనిపిస్తున్నారా​ అని ఎద్దేవా చేశారు. ఉద్యోగులు చేసిన సకల జనుల సమ్మె వల్లే రాష్ట్రం వచ్చిందని మరిచిపోవదన్నారు. ధనిక లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ అంటూనే ఆరేళ్లుగా కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో బంగారు తెలంగాణ లేదని, కుటుంబ తెలంగాణ, బేకారు తెలంగాణగా రాష్ట్రం తయారయ్యిందని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత దొరల పాలన తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్‌ సిద్దమయ్యారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top