మెజారిటీ జెడ్పీ స్థానాలు సాధించాలి

Majority of ZP seats should be achieved Says Laxman - Sakshi

అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయం

పాలనలో టీఆర్‌ఎస్‌ విఫలమైంది: కె.లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న పరిషత్తు ఎన్నికల్లో మెజారిటీ జెడ్పీ స్థానాలను సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అధ్యక్షతన బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జిల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్‌ ఎన్ని కలకు సంబంధించిన సమీక్షతోపాటు రాబోయే స్థాని క సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికపై చర్చించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో దాదాపు అన్ని నియోజకవర్గాలలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఓటింగ్‌ సరళి ఉన్నట్లు నేతలు అభిప్రాయపడ్డారు. ప్రధానిగా నరేంద్రమోదీనే ఉండా లన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అయినట్లు పేర్కొన్నారు. అలాగే ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు కాబట్టి బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలన్న దృక్పథం ప్రజల్లో వచ్చినట్లు సమావేశం అభిప్రాయపడింది. అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం టీఆర్‌ఎస్‌ బీజేపీ మధ్యే పోటీ జరిగినట్లుగా ఉందని, టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని ప్రజలు భావించినట్లు కూడా సమావేశం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పూర్తి సామర్థ్యంతో పోటీ చేయాలని, మెజారిటీ జెడ్పీ స్థానాలు కైవసం చేసుకునేలా సన్నద్ధం కావాలని నిర్ణయించింది. 

టీఆర్‌ఎస్‌పై పోరాటం: లక్ష్మణ్‌ 
సమావేశంలో పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య కంటే ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలు గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. హంగ్‌ వచ్చే అవకాశముందని, కచ్చితంగా టీఆర్‌ఎస్‌ సహాయంతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుందని, కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఖాయమని కేసీఆర్‌ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్సే కాదు ఏ ఇతర పార్టీ సహకారం లేకుండానే ఎన్డీయే పూర్తిస్థాయిలో మెజారిటీ స్థానాలు సాధిస్తుందని వెల్లడించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బీజేపీ క్షేత్రస్థాయి పోరాటాన్ని ఉధృతం చేస్తుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని, అసమర్థతను బట్టబయలు చేస్తామన్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి అయోమయంలో ఉందని, అసలు ప్రభుత్వం పనిచేస్తుందా? లేదా అనే అనుమానాలు ప్రజలకు వస్తున్నాయని పేర్కొన్నారు.

పాలనను గాలికి వదిలేసి, ఎన్నికలపైనే దృష్టి సారిస్తున్న ప్రభుత్వ పెద్దలు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల ప్రక్షాళన అనేది కేవలం ఉద్యోగులపై కక్ష సాధింపునకేనన్నారు. ఉద్యోగుల మధ్యంతర భృతి, పీఆర్‌ఎస్‌ ఏమైందని, కొత్త్త కొలువుల సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఇంటర్మీడియట్‌ విద్యార్థుల భవిత వ్యాన్ని త్రిశంకు స్వర్గంలో ఉంచారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటం తీవ్రతరం చేస్తామని, రాబో యే స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలాన్ని చాటుతామన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి హన్స్‌రాజ్‌ ఆహిర్, ఎంపీ బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, శాసనమండలి పక్ష నాయకులు ఎన్‌.రాంచందర్‌రావు, కిషన్‌రెడ్డి, ఇతర రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top