ఆలోచించి ఓటు వేయండి

Madhavaram Krishna Rao Election Campaign in Kukatpally - Sakshi

రూ.4 వేల కోట్లతో  అభివృద్ధి పనులు

ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రత్యర్థుల యత్నం

కూకట్‌పల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాధవరం కృష్ణారావు  

కేపీహెచ్‌బీకాలనీ: కూకట్‌పల్లి నియోజకవర్గం ప్రజలు ఆలోచించి వేయాలని ఓటు వేయాలని, అభివృద్ధి పథంలో దూసుకువెళ్తున్న కూకట్‌పల్లిని మరింత అభివృద్ధి చేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్తి, మాజీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజైన బుధవారం ఆయన నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో ర్యాలీలు, పాదయాత్రల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..కూకట్‌పల్లి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేగా తనకు దక్కుతుందన్నారు. గత నాలుగున్నరేళ్లుగా తాను కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా అన్ని సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకున్నానన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో కూకట్‌పల్లి నియోజకవర్గం ముందంజలో ఉందన్నారు. ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందన్నారు. నియోజకవర్గం, సమస్యలపైనా ఎలాంటి అవగాహన, అనుభవం లేనివారికి ఓటువేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.  

ప్రజల్లో చిచ్చుపెట్టొద్దు....
కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని, ఎన్నికల పేరుతో ప్రత్యర్థి పార్టీల నాయకులు  ప్రజల మధ్య చిచ్చుపెట్టడం భావ్యం కాదన్నారు. కులం, ప్రాంతం పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో తిష్టవేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎలాగైనా గెలుపొందాలనే తపనతో   రాహుల్‌గాంధీ మొదలు చంద్రబాబునాయుడు, బాలక్రిష్ణ తదితరులు కూకట్‌పల్లిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. సామాన్య కార్యకర్తస్థాయి నుంచి ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎదిగిన తనను అడ్డుకునేందుకు జాతీయస్థాయి నేతలు, ముఖ్యమంత్రులు రంగంలోకి దిగడంతో ప్రజలు ఎవరివైపు ఉన్నారో అర్థమవుతుదన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నా కేపీహెచ్‌బీలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచార రథాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకుని అద్ధాలు పగులగొట్టారని, బాలక్రిష్ణ రోడ్‌షో నేపథ్యంలో తాము ఎలాంటి నిరసనలు, ఫిర్యాదులు చేయకుండా వదిలేశామన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.  

అభివృద్ధిని చూసి ఆదరించండి..
కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించి తనను ఆదరించాలని క్రిష్ణారావు కోరారు. బాలానగర్‌లో రోడ్డు విస్తరణ, రూ.400 కోట్లతో ఫ్లైఓవర్‌ నిర్మాణం, జేఎన్‌టీయూహెచ్‌ రోడ్డులో రూ.113 కోట్లతో ఫ్లైఓవర్‌ నిర్మాణం, రూ.70 కోట్లతో హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ వద్ద రైల్వే అండర్‌పాస్‌ల నిర్మాణం, ఖైత్లాపూర్‌ నుంచి అయ్యప్పసొసైటీకి  రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం తదితర ప్రధాన పనులతో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించామన్నారు. కాలనీలు, బస్తీల్లో డ్రైనేజీ, తాగునీరు, సీసీరోడ్లు, వీడీసీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. మిషన్‌ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీటిని సరఫరా చేసేందుకు సుమారు 9 రిజర్వాయర్‌లను నిర్మించామని, 178కిలో మీటర్ల మేర నూతన ఫైప్‌లైన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజు విడిచి రోజు నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, షటిల్‌కోర్టులు, ఇండోర్‌స్టేడియాలు, పార్కులు, ఆటస్థలాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నానని. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా పార్కు నిర్మాణం, నాన్‌వెజ్‌ మార్కెట్, రైతుబజార్ల నిర్మాణం తదితర పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top