పదవీ త్యాగానికి ఆమోదం

LS speaker accepts resignations of five YSRCP MPs - Sakshi

ప్రత్యేక హోదా సాధన పోరాటంలో చరిత్రాత్మక ఘట్టం

వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించిన లోక్‌సభ స్పీకర్‌

ఒక రోజు ముందు నుంచే అమల్లోకి వస్తాయని లోక్‌సభ బులెటిన్‌లో స్పష్టీకరణ  

స్పీకర్‌పై పదేపదే ఒత్తిడి తెచ్చి రాజీనామాలు ఆమోదింపజేసుకున్న ఎంపీలు  

నాలుగేళ్లుగా సాగిస్తున్న అలుపెరుగని పోరాటంలో మరో ముందడుగు  

ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి, హోదా కోసం ఉప్పెనలా ఉద్యమిస్తామని నేతల ప్రకటన   

జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన ‘ప్రత్యేక హోదా’

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా సాధన పోరాటంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గురువారం ఆమోదించారు. దీంతో లక్ష్య సాధన కోసం నాలుగేళ్లుగా అన్ని వేదికలపై అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్న వైఎస్సార్‌సీపీ మరో అడుగుముందుకు వేసినట్ల యింది.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌పై పదేపదే ఒత్తిడి తెచ్చి రాజీనామాలను ఆమోదింపజేసు కున్నారు. రాష్ట్ర సర్వతోముఖా భివృద్ధికి దోహదపడే హోదా తప్ప ఇంకేదీ తమకు ఆమోదయోగ్యం కాదంటూ పదవులను తృణప్రాయంగా త్యజిం చారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ఆదేశాల మేరకు... పదవీ కాలం మరో ఏడాదిపాటు ఉన్నప్పటికీ లోక్‌సభ నుంచి వైదొలిగారు.

ఇక ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి, ప్రత్యేక హోదా వచ్చేదాకా ఉప్పెనలా ఉద్యమిస్తామని ప్రకటించారు. నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి ఉండి, అధికారం అనుభవించిన తెలుగుదేశం పార్టీ చేయలేని పనిని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ చేసి చూపిందంటూ ప్రజాస్వామ్యవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హోదా సాధన విషయంలో ఏ పార్టీ చిత్తశుద్ధి ఏమిటో దీంతో తేలిపోయిందని అంటున్నారు. ఎంపీల రాజీనామాల ఆమోదంతో ప్రత్యేక హోదా అంశంపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విభజన వల్ల అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఆదుకోవడానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి దేశ పార్లమెంటరీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజీనామాలను ఆమోదింపజేసుకోవడం ద్వారా హోదా ఆకాంక్షను జాతీయస్థాయిలో ఎలుగెత్తి చాటారు.

పదవులను వదులుకుని, హోదా సాధన పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు ఏప్రిల్‌ 6న స్పీకర్‌ ఫార్మాట్‌లోనే తమ రాజీనామాలను సమర్పించిన సంగతి తెలిసిందే. వాటిని ఆమోదిస్తూ లోక్‌సభ స్పీకర్‌  సుమిత్రా మహాజన్‌ జూన్‌ 21న(గురువారం) తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఒక రోజు ముందు నుంచే.. అంటే జూన్‌ 20(బుధవారం) నుంచే ఈ రాజీనామాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
 

రాజీనామాల ఆమోదం కోసం ఎంపీల పట్టు
ఎంపీల రాజీనామాల ఆమోదానికి ముందు స్పీకర్‌ ఒకటికి రెండుసార్లు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంపీలు మాత్రం తమ పదవుల కంటే ప్రత్యేక హోదాయే ముఖ్యమని తెగేసి చెప్పారు. రాజీనామాలకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఎంపీలు మే 29న స్పీకర్‌ను ఆమె పిలుపు మేరకు వెళ్లి కలిశారు. రాజీనామాలను ఆమోదించాలంటూ పట్టుబట్టారు. స్పీకర్‌ వారం రోజులు జాప్యం చేయడంతో మళ్లీ జూన్‌ 6న వారు తమంతట తామే ఆమెను కలిసి రాజీనామాల ఆమోదం కోసం పట్టుబట్టారు.

దాంతో మరోమార్గం లేక నిబంధనల ప్రకారం ఎంపీల రాజీనామాలను స్పీకర్‌ ఆమోదించారు. ఈ విషయాన్ని లోక్‌సభ బులెటిన్‌ ద్వారా సెక్రటరీ జనరల్‌ స్నేహలతా శ్రీవాస్తవ వెల్లడించారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి రాజీనామాలను ఆమోదించినట్టు విడివిడిగా ఉత్తర్వులను గురువారం బులెటిన్‌లో ప్రచురించారు.

హోదా కోసం ఎందాకైనా...
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల హితం కోరి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా కోసం పోరాడారు. హోదా డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పార్లమెంట్‌ సమావేశాలను స్తంభింపజేశారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌ రాసిన లేఖను పార్లమెంట్‌లోని ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలకు అందజేసి, వారి మద్దతు కూడగట్టారు. పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల న్యాయమైన హక్కు అంటూ గొంతెత్తి నినదించారు. ప్యాకేజీలతో ప్రయోజనం శూన్యమని తేల్చిచెప్పారు.

ప్రతి దశలోనూ హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలంతా ఢిల్లీకి వెళ్లి జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేశారు. ఎంపీలు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఆఖరి క్షణం దాకా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 6న పదవులకు రాజీనామాలు చేసి, ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు.

ఏప్రిల్‌ 6 నుంచి 11వ తేదీ వరకూ ఎంపీలు చేసిన నిరాహార దీక్ష యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. పలువురు జాతీయ పార్టీల నేతలు దీక్షా శిబిరానికి హాజరై వైఎస్సార్‌సీపీ ఎంపీలకు సంఘీభావం తెలిపారు. పార్లమెంట్‌ సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీని సాధించుకోవడం హక్కు అని వారంతా ప్రకటించారు. హోదా పోరాటాన్ని ఉధృతం చేయాలని సూచించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ‘వంచనపై గర్జన’ పేరుతో ఇప్పటికే రాష్ట్రంలో రెండు దీక్షలు చేసింది. ఏప్రిల్‌ 30న  విశాఖపట్నంలో, జూన్‌ 2న నెల్లూరులో వంచనపై గర్జన సభలు నిర్వహించింది.

వృథా కాబోదు మీ త్యాగం
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేసిన పదవీ త్యాగం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, వారి త్యాగం వృథా కాబోదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఖాళీ అయిన ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడమనేదిఎన్నికల కమిషన్‌ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ఎంపీల రాజీనామాల ఆమోదంతో ప్రత్యేక హోదా పోరాటం ఇక తీవ్రతరం కావడం ఖాయమని చెబుతున్నారు.

 ఎంపీల రాజీనామా పర్వం
ప్రత్యేక హోదా సాధన కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఆఖరి క్షణం పోరాటం చేస్తారని, కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే వారంతా తమ పదవుల నుంచి వైదొలుగుతూ రాజీనామా లేఖలను సమర్పించి వస్తారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన నెల్లూరు జిల్లా కలిగిరిలో బహిరంగ సభలో ప్రకటించారు.
హోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 1వ తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి.
వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మార్చి 5న ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా తమ పార్టీ తరపున ఎన్డీయే ప్రభుత్వంపై మార్చి 22న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలను కుదిస్తారనే వార్తలు రావడంతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు నిర్ధేశిత తేదీ కంటే ముందుగానే మార్చి 15న లోక్‌సభ స్పీకర్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసు అందించారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ వరుసగా ఇచ్చిన 13 అవిశ్వాస తీర్మానం నోటీసుల్లో 12 నోటీసులను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ లోక్‌సభలో ప్రస్తావించారు. సభలో గందరగోళ పరిస్థితులు ఉన్నందువల్ల వాటిపై చర్చ చేపట్టలేకపోతున్నట్లు తెలిపారు.
అవిశ్వాసం తీర్మానంపై పార్లమెంట్‌లో చర్చించాలని గొడవ జరుగుతున్న తరుణంలోనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి తమ ఎంపీల పోరాటం అవిశ్వాసం, రాజీనామాలతో ఆగదని, రాజీనామాలు సమర్పించిన వెంటనే అమరణ నిరాహార దీక్షకు పూనుకుంటారని మార్చి 31న పేరేచర్లలో ప్రకటించారు.
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరి రోజైన ఏప్రిల్‌ 6 వరకూ ప్రత్యేక హోదా కోసం లోక్‌సభలో పోరాటం సాగించిన ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి సమావేశాలు వాయిదా పడగానే నేరుగా స్పీకర్‌ చాంబర్‌కు వెళ్లి, స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖలను సమర్పించారు.
అక్కడి నుంచి ఏపీ భవన్‌కు వచ్చి అమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆరు రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
తమ రాజీనామాలను ఆమోదించాలని మే 29న స్పీకర్‌కు ఎంపీలు మరోసారి విన్నవించారు.
అయినప్పటికీ ఆమోదించకపోవడంతో జూన్‌ 6న మరోసారి స్పీకర్‌ను కలిశారు. తమ రాజీనామాలను ఆమోదించేందుకు స్పీకర్‌ సంసిద్ధత వ్యక్తం చేశారని ఎంపీలు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు జూన్‌ 21న స్పీకర్‌ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ రాజీనామాలు జూన్‌ 20వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని లోక్‌సభ బులెటిన్‌లో పేర్కొన్నారు.  
 

పదవులు వదులుకోవడం అభినందనీయం
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు పదవులకు రాజీనామా చేయడమే కాకుండా.. వాటిని ఆమోదింపజేసుకోవడం అభినందనీయం. ప్రజల మనోభిప్రాయాలను గౌరవించి ఏడాది పదవీకాలాన్ని తృణప్రాయంగా వదులుకోవడాన్ని ఆహ్వానిస్తున్నాం. మిగిలిన 20 మంది కూడా  తక్షణమే రాజీనామా చేయాలి.      – లక్ష్మణరెడ్డి, అధ్యక్షులు, జనచైతన్య వేదిక

హోదా ఉద్యమం మరింత ఉధృతం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీతో కలిపి ప్రత్యేక హోదా సాధన సమితి ఉద్యమిస్తోంది.  కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెంచి ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు రాజీనామా చేసి ఆమోదింపజేసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. – చలసాని శ్రీనివాస్‌
ఆ ఐదుగురు రియల్‌ హీరోలు
 ప్రజల మనోభిప్రాయాలను గౌరవించి పద వులను త్యాగం చేయడం ద్వారా ఐదుగురు వైఎ స్సార్‌ సీపీ మాజీ ఎంపీలు రియల్‌ హీరోలు అయ్యారు.ప్రత్యేక ఆర్థిక సాయం కోసం అంగీకరించి సీఎం చంద్రబాబు రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – షబ్బీర్‌ అహ్మద్, దళిత, మైనార్టీ ఐక్య వేదిక రాష్ట్ర నేత

ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి :

ఒకటే మాట.. ఒకటే బాట

‘టీడీపీకి కచ్చితంగా చెప్పుదెబ్బ’

వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం

మీ త్యాగం వృథా కాదు : వైఎస్‌ జగన్‌

చిత్తశుద్ధి నిరూపించుకున్నాం..

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి..

వైఎస్‌ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా!

ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు!

‘వంచన’పై వైఎస్సార్‌ సీపీ గర్జన!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top