‘వంచన’పై వైఎస్సార్‌ సీపీ గర్జన!

YSR Congress Party Conducts Hunger Strike in Nellore - Sakshi

నెల్లూరులో ‘వంచనపై గర్జన’ దీక్ష..

చంద్రబాబు మోసాలపై మండిపడ్డ వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీరని అన్యాయంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరు ముమ్మరం చేసింది. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు మోసపూరిత వైఖరిపై వైఎస్సార్‌ సీపీ గర్జించింది. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోర వైఫల్యం, పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా శనివారం నెల్లూరులో ‘వంచనపై గర్జన’ దీక్ష చేపట్టింది. నెల్లూరులోని వీఆర్‌ కళాశాల మైదానంలో ఉదయం నుంచి సాయంత్ర 5 గంటల వరకు ‘వంచనపై గర్జన’ నిరాహార దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో పదవులకు రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్‌ సీపీ లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్లు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నల్లదుస్తులు ధరించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ.. నేతలు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రసంగించారు. వారు ఏమన్నారంటే..

హోదా పోరాటానికి అంబాసిడర్‌ వైఎస్‌ జగన్‌
ప్రత్యేక హోదా పోరాటానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ప్రధాన దోషిగా నిలిచి పోతుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నీతి, నియమాలు లేవని, కేవలం కుట్ర పూరిత రాజకీయాలు చేయడమే ఆయనకు అలవాటంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అనేక దుర్మార్గాలు చేశారు కాబట్టి హోదాపై మాట మార్చారని చెప్పారు. ప్రస్తుతం ఏం చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నేతలకు చంద్రబాబు దగ్గరవుతున్నారని పేర్కొన్నారు. 10 లక్షల మందికి చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారని.. ఆ 10 లక్షల మంది టీడీపీ కార్యకర్తలేనని పెద్దిరెడ్డి విమర్శించారు.

చంద్రబాబు సొంతూరుకే ఏం చేయలేదు
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా చంద్రబాబు అమలు చేయలేదు అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్‌రెడ్డి వంచనపై గర్జన దీక్షలో గుర్తుచేశారు. మీ స్వగ్రామం నారావారిపల్లెలో అయినా కనీసం హామీలు నెరవేర్చారా అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కోటంరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన కనీసం నాలుగు ముఖ్య హామీలపై చర్చించేందుకు తాము సిద్ధమని, అందుకు సీఎం చంద్రబాబు సిద్ధమా అని కోటంరెడ్డి సవాల్‌ విసిరారు. హామీలు అమలు చేశారని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని వెల్లడించారు. రాజన్న తనయుడు, జననేత వైఎస్‌ జగన్‌ పోరాటాలతోనే ప్రత్యేక హోదా అంశం ఇంకా సజీవంగా ఉందన్నారు. హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఆమరణ దీక్షలు, యువభేరిలు, బంద్‌లు చేయగా.. అధికారంలో ఉండి కూడా చంద్రబాబు ఏం చేయలేకపోయారంటూ విమర్శించారు. జేసీ బ్రదర్స్‌ సీఎం చంద్రబాబు బంట్రోతుల్లా తయారయ్యారంటూ ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top