లోక్‌సభ ఎన్నికలు : తుది దశ ఎన్నికల అప్‌డేట్స్‌..

Lok Sabha Elections 7th Phase Voting Starts - Sakshi

న్యూఢిల్లీ: అడపాదడపా ఘర్షణలు మినహా సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్‌ ప్రశాంతంగాముగిసింది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయం‍త్రం 6 గంటలకు ముగిసింది. దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 స్థానాల్లో పోలింగ్‌ జరిగింది. 918 మంది అభ్యర్థుల తమ భవిష్యత్తును పరీక్షించుకున్నారు. ఏడో విడత ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దేశవ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 

►దేశ వ్యాప్తంగా జరుగుతున్న తుది విడత ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 53.03 శాతం పోలింగ్‌ నమోదు అయింది. రాష్ట్రాల వారిగా చూస్తే హిమాచల్‌ ప్రదేశ్‌ 57.43శాతం, మధ్యప్రదేశ్‌ 59.75శాతం, పంజాబ్‌ 50.49శాతం, ఉత్తరప్రదేశ్‌ 74.21శాతం, పశ్చిమ బెంగాల్‌లో 64.87శాతం, జార్ఖండ్‌లో 66.64శాతం, చండీగఢ్‌లో 51.18శాతం పోలింగ్‌ నమోదు అయింది.

►పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోల్‌కతాలోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.

►భారత తొలి ఓటరు శ్యామ్‌ సరన్‌ నేగి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కల్పా పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా నేగికి ఈసీ అపూర్వ స్వాగతం పలికింది. డప్పు చప్పుళ్లతో స్వాగతం పలుకుతూ పోలింగ్‌ బూత్‌ వరకూ తీసుకొచ్చి దగ్గర ఉండి మరీ ఓటు వేయించారు. శ్యామ్ సరన్ నేగి.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 102 ఏళ్ల సీనియర్ ఓటర్.  స్వతంత్ర భారతంలో జరిగిన 1951లో జరిగిన తొలి జనరల్ ఎలక్షన్ లో ఓటేసిన ఆయన.. తాజాగా.. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ ఓటు వేశారు.

► ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోల్‌కతాలోని బారిషా జనకల్యాణ్‌ విద్యాపీఠం పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.

►తుది విడత ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు దేశవ్యాప్తంగా 51.95 శాతం పోలింగ్‌ నమోదు అయింది. రాష్ట్రాల వారిగా చూస్తే బిహార్‌లో 46.66శాతం, హిమాచల్‌ ప్రదేశ్‌లో 49.43శాతం, మధ్యప్రదేశ్‌లో 57.27శాతం, పంజాబ్‌లో 48.18శాతం, ఉత్తరప్రదేశ్‌లో 46.07శాతం, పశ్చిమబెంగాల్‌లో 63.58శాతం, జార్ఖండ్‌లోలో 64.81శాతం, చండీగఢ్‌లో 50.24శాతం పోలింగ్‌ నమోదైంది.

►రెండు గ్రూపుల మధ్య ఏర్పడిన తగాదాల వల్ల బిహార్‌లోని రెండు పోలింగ్‌ బూత్‌ల్లో పోలింగ్‌ ఆగిపోయింది. పాలిగంజ్‌ నగరంలోని సర్కున గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్ నంబర్‌ 101,102లలో పోలింగ్‌ను నిలిపివేశామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. 

►పుట్టుకతోనే తల భాగం అతుక్కొని పుట్టిన బిహారీ కవలలు సబా- ఫరా (23)లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సబా-ఫరా బిహార్‌లో తొలిసారి విడివిడిగా ఓటు వేశారు. పట్నానగరంలోని సమన్‌ పురా ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరికి తొలిసారి వేర్వేరు ఓటరు గుర్తింపు కార్డులు జారీ అయ్యాయి. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించున్నారు. అప్పట్లో వీరిద్దరిని ఒక్కరుగానే పరిగణించి ఓటు గుర్తింపుకార్డు ఇచ్చారు. కానీ శారీరకంగా కలిసి ఉన్నంతమాత్రన వారి వ్యక్తిగత హక్కులను కాదనడం సరికాదని వారిద్దరికి వేర్వేరు గుర్తింపు కార్డులు జారీ చేశారు. 

►ఓటు విలువను తెలియజేసిన సంఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మరికాసేపట్లో పెళ్లి ఉందనగా.. కాబోయే వధూవరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ పోలింగ్‌ బూత్‌లో వీళ్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

►దేశ వ్యాప్తంగా జరుగుతున్న తుది విడత ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 39.85 శాతం పోలింగ్‌ నమోదు అయింది. రాష్ట్రాల వారిగా చూస్తే హిమాచల్‌ ప్రదేశ్‌ 34.47శాతం, మధ్యప్రదేశ్‌ 43.89శాతం, పంజాబ్‌ 36.66శాతం, ఉత్తరప్రదేశ్‌ 36.37శాతం, పశ్చిమ బెంగాల్‌ 47.55శాతం, జార్ఖండ్‌ 52.89శాతం, చండీగఢ్‌లో 35.60శాతం పోలింగ్‌ నమోదు అయింది.

బౌన్సర్‌ వీరంగం
పట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఓటువేసే క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ ఫోటోగ్రాఫర్‌‌ తేజ్‌ప్రతాప్‌ కారు అద్దాలు ధ్వంసం చేశాడంటూ ఆయన వ్యక్తిగత సిబ్బంది ఒకరు వీరంగం సృష్టించాడు.   కెమెరామెన్‌పై దాడిచేసి, ఆయన కెమెరాను ధ్వంసం చేశాడు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంత జరిగినా తేజ్‌ప్రతాప్‌ నోరుమెదపలేదు. తనను హతమార్చేందుకు కుట్ర జరిగిందని ఆయన ఆరోపించడం గమనార్హం.

బిజీ ఉన్నా..!
సిమ్లా : పెళ్లి పనులతో బిజీగా ఉన్నప్పటికీ ఓ కుటుంబం కర్తవ్యాన్ని మరువలేదు. మరికాసేపట్లో పెళ్లి ఉందనగా.. సకుటుంబ సపరివారంగా వచ్చి మనాలిలోని బూత్‌ నెం.8లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. సంప్రదాయ అలంకరణతో ఉన్న పెళ్లి కుమారుడికి పోలింగ్‌ ఆఫీసర్‌ శుభాకాంక్షలు తెలిపారు.
పట్నా : సీనియర్‌ లీడర్‌, పట్నా సాహిబ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా కాదమ్‌లోని సెయింట్‌ సేవెరిన్‌ స్కూల్‌లో ఓటు వేశారు.

కన్నెర్రజేసిన గ్రామస్తులు..
బిహార్‌ : నలందా జిల్లా రాజ్‌గిర్‌ బ్లాక్‌లోని చందోరా గ్రామ ప్రజలు కన్నెర్ర జేశారు. తమ గ్రామానికి ఇంతవరకు సరైన రోడ్డు వసతి కూడా లేదని నిరసిస్తూ ఓటింగ్‌ బాయ్‌కాట్‌ చేశారు. బూత్‌ నెం.299కు చేరుకుని ఈవీఎం మెషీన్‌ను ధ్వంసం చేశారు. బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ కారుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. ‘రోడ్లు లేవు. అలాంటప్పుడు ఓట్లు కూడా లేవు’అంటూ నినదించారు.

ఓటు వేసిన లోక్‌సభ స్పీకర్‌..
లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఇండోర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ నేత, పంజాబ్‌ మంత్రి నవజోత్‌సింగ్‌ సిద్ధూ, ఆయన సతీమణి నవోజోత్‌ కౌర్‌ అమృత్‌సర్‌లోని బూత్‌ నెం.134లో ఓటు వేశారు.

స్కార్ఫ్‌ ధరించి దొంగ ఓట్లు..!
పోలింగ్‌ బూత్‌ 150/137లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన మహిళా కార్యకర్తలు అక్రమాలకు పాల్పడుతున్నారని జాదవ్‌పూర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి అనుపమ్‌ హజ్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కార్ఫ్‌లు ధరించి దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై వారిని విరవరణ కోరగా పోలింగ్‌ బూత్‌లో అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ జాదవ్‌పూర్‌ మండల్‌ ప్రెసిడెంట్‌, అతని డ్రైవర్‌ను టీఎంసీ రౌడీలు చితకబాదారని, కారు అద్దాలు పగులగొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి బారి నుంచి మరో 3 బీజేపీ పోలింగ్‌ ఏజెంట్లను రక్షించామని ఆయన తెలిపారు. బీజేపీకి ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో టీఎంసీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, నియోజకవర్గంలోని 52 బూత్‌లలో టీఎంసీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని అనుపమ్‌ ఆరోపించారు. 

పోలింగ్‌ కేంద్రం వద్ద ధర్నా..!
కోల్‌కత : బసిర్హాత్‌లోని బూత్‌ నెం.189 వద్ద ఉద్రిక్తత నెలకొంది. తృణమూల్‌ నేతలు తమను ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. బీజేపీ బసిర్హాత్‌ అభ్యర్థి సయంతన్‌ బసు మాట్లాడుతూ.. ‘మాపార్టీకి చెందిన 100 మందిని ఓటువేయకుండా తృణమూల్‌ నేతలు అడ్డుకున్నారు. టీఎంసీ నేతల ఆగడాలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. మా పార్టీని వారిని ఓటేసేందుకు తీసుకెళ్తాం’అన్నారు.

టీఎంసీ ఉగ్రవాద సంస్థనా..!
తృణమూల్‌ నేతలు జిహాదీలుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ సీనియర్‌నేత సీకే బోస్‌ విమర్శించారు. ‘నిన్న రాత్రి మా పార్టీ నాయకుల నుంచి ఫోన్లు వచ్చాయి. పోలింగ్‌ ఏజెంట్లుగా ఉంటే చంపేస్తామని తృణమూల్‌ నేతలు బెదిరింపులకు దిగారట. ఇంతటి దౌర్జన్యాలకు పాల్పడుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌కు, ఉగ్రవాద సంస్థలకు తేడా ఏమైనా ఉందా’ అని బోస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటింగ్‌ శాతం..
ఉదయం 9 గంటల వరకు తుది విడత ఎన్నికల్లో భాగంగా.. బిహార్‌లో 10.65 %, హిమాచల్‌ ప్రదేశ్‌లో 0.87 %, మధ్యప్రదేశ్‌లో 7.16 %, పంజాబ్‌లో 4.64 %, ఉత్తర్‌ప్రదేశ్‌లో 5.97 %, పశ్చిమ బెంగాల్‌లో 10.54 % పోలింగ్‌ నమోదైనట్టు సమాచారం.

నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు..
తమిళనాడులోని సూలూర్‌, అరవకురిచి, ఒట్టపిదారం, తిరుపరమ్‌కుంద‍్రం అసెంబ్లీ స్థానాల్లో కూడా ఈరోజే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు  పోలింగ్‌  పారంభమైంది. భారీ భద్రత నడుమ పోలింగ్‌ కొనసాగుతోంది. 10వేల మంది పారామిలటరీ, పోలీసు బలగాలు మోహరించారు. ప్రశాంతంగా పోలింగ్‌ సాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాయనే వార్తలు వెలువడ్డాయి. 

అసెంబ్లీ ఉప ఎన్నికలు..

తుది విడతలో పోలింగ్‌లో చండీగఢ్‌ సీటుతో పాటు ఉత్తరప్రదేశ్‌(13), పంజాబ్‌(13), పశ్చిమబెంగాల్‌(9) బిహార్‌(8), మధ్యప్రదేశ్‌(8), హిమాచల్‌ప్రదేశ్‌(4), జార్ఖండ్‌(3) రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఇప్పటివరకూ జరిగిన ఆరు విడతల్లో పోలింగ్‌ సగటు 66.88 శాతంగా నిలిచింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత పత్రికలు, వార్తా చానల్స్‌ తమ ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలను ప్రకటించుకోవచ్చు.

హర్భజన్‌సింగ్‌

ఓటు వేసిన కేంద్రమంత్రి..
కేంద్రమత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పట్నా మహిళా కళాశాలలోని బూత్‌ నెం.77లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ జలంధర్‌లోని గార్హి గ్రామంలో ఓటు వేశారు.  బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ నాయకుడు అభిషేక్‌ బెనెర్జీ దక్షిణ కోల్‌కత నియోజకవర్గంలోని బూత్‌ నెం. 208లో ఓటు వేశారు. 
లుధియానా : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి మనీష్‌ తివారీ శరభ నగర్‌లోని సాక్రెడ్‌ హార్ట్‌ కాన్వెంట్‌ స్కూల్‌లో ఓటు వేశారు. ఆయన ఆనంద్‌పూర్‌ సామిబ్‌ నుంచి బరిలో ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

రవిశంకర్‌ ప్రసాద్‌

ఇంతకాలమా..!
బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ పట్నాలోని రాజ్‌భవన్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం 326లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికలు ఇంత సుదీర్ఘ కాలం నిర్వహించడం సరికాదని అన్నారు. ఎన్నికల దశల్లో రోజుల వ్యవధి ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై అన్ని రాజకీయ పక్షాల నాయకులతో మాట్లాడతానని తెలిపారు.

ఇంక్‌ పూశారు..!
తమను ఓటేయకుండా వేలికి ఇంక్‌ పూశారని చౌందౌలీ నియోజకవర్గంలోని తారా జీవన్‌పూర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి ఓటేస్తారు కదా అని ఆరా తీసి తమ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శనివారం రూ.500 ఇచ్చారని, అనంతరం తమ చేతి వేలికి ఇంక్‌ పూశారని వెల్లడించారు. ‘ఇక మీరు ఓటు వేయలేరు’ అని చెప్పి వెళ్లిపోయారని ఆరోపించారు. కాగా, ఈ విషయంపై ఎస్‌డీఎమ్‌ (సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌) కేఆర్‌ హర్ష్‌ మాట్లాడుతూ.. బాధితులు ఓటేయొచ్చని తెలిపారు. అయితే, వారు పోలిస్‌స్టేషన్‌లో ఇచ్చే కంప్లెయింట్‌లో.. బలవంతంగా తమ చేతి వేలికి ఇంక్‌ పూశారని వెల్లడించాల్సి ఉంటుందని తెలిపారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓటు వేసిన యోగి..
చివరిదశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమయ్యే ముందు ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావాలని, నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. అనంతరం గోరఖ్‌పూర్‌లోని 246 పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

బెంగాల్‌లో కట్టుదిట్టమైన భద్రత
పశ్చిమబెంగాల్‌లోని 9 స్థానాలకు తుది విడతలో పోలింగ్‌ జరుగుతోంది. బెంగాల్‌లో తీవ్రమైన హింస చెలరేగిన నేపథ్యంలో తొలిసారి ఆర్టికల్ 324ను ఉపయోగించిన కేంద్ర ఎన్నికల సంఘం ఒక రోజు ముందే అక్కడ ప్రచారం ముగించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులకు అదనంగా 710 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top