
సాక్షి, విజయవాడ : మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గురువారం వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సమస్యలపై ఉమ్మారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కొణతాల మాట్లాడుతూ.. విశాఖకు రైల్వే జోన్ వచ్చిందని సంతోషపడాలో.. బాధపడాలో తెలియడం లేదన్నారు. రైల్వే జోన్ ఇచ్చినట్లే ఇచ్చి విశాఖ డివిజన్‌ను తీసేయడం సరి కాదన్నారు.
ఉత్తరాంధ్ర సమస్యలపై అన్ని పార్టీలకు నివేదిక ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో ఉత్తరాంధ్ర సమస్యలను చేర్చాలని కోరారు. రాజకీయాల కంటే కూడా ఉత్తరాంధ్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని కొణతాల స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరే అంశం గురించి వచ్చే వారం ప్రకటిస్తానని తెలిపారు.