మరో మాజీ ఎమ్మెల్యేను త్వరలోనే చంపేస్తారు! | komatireddy venkat reddy fires on cm kcr | Sakshi
Sakshi News home page

Jan 29 2018 4:00 PM | Updated on Aug 29 2018 4:18 PM

komatireddy venkat reddy fires on cm kcr - Sakshi

సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో జరుగుతున్న వరుస హత్యలపై కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా చంపేస్తారని అన్నారు.  ఈ విషయం డీజీపీకి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసీఆర్ దోపిడీ రాజ్యానికి అండగా ఉండటానికే పోలీసులు ఉన్నారా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే బొడ్డుపల్లి శ్రీనివాస్‌ హత్య కేసును సీబీఐకి సిఫారసు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఈ కేసు వెనుక సీఎం హస్తం ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించకపోతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసులో పోలీసులు కట్టకథ చెప్పారని, ఈ కేసులో మిర్చీ బండి యాదయ్యను ఎందుకు విచారించలేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. శ్రీనివాస్ భార్య లక్ష్మి డెడ్ బాడీని మొదట చూసిందని అబద్ధం చెప్పారని, పోలీసు స్టేషన్‌కు వెళ్లాకే భర్త చనిపోయాడని లక్ష్మికి తెలిసిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, డీఎస్పీల వల్లే ఈ హత్య జరిగిందన్నారు. దీనికి సీఎం కేసీఆర్ సహకారం ఉందని ఆరోపించారు. ఈ కేసు విషయమై ఎస్పీ మాట్లాడిన విధానం బాధాకరమని, ఆయనను ఎస్పీ అనాలనిపించడం లేదని చెప్పారు.  నాలుగు రోజుల కాల్ డేటా తీస్తే మొత్తం వ్యవహారం అర్థమవుతుందని పేర్కొన్నారు. హత్య చేయగానే నిందితులు నకిరేకల్ వెళ్లి తలదాచుకున్నారని, ఈ కేసు విచారణలో పొంతన కుదరడం లేదని తెలిపారు.

సంఘటన జరగబోతోందని పోలీసులకు ముందే తెలుసు అని కోమటిరెడ్డి ఆరోపించారు. డీజీపీ, ఎస్పీ అందరూ కుమ్మక్కై ఈ కేసులో కట్టుకథ అల్లారని విమర్శించారు. హత్య పథకం ప్రకారం జరిగిందని, రాళ్లు కూడా ముందే తెచ్చిపెట్టుకున్నారని చెప్పారు.  గోపీ కాంగ్రెస్‌లో ఉండి కోవర్టుగా మారాడని తెలిపారు. ఇది ప్రభుత్వ ప్రాయోజిత రాజకీయ హత్య, రౌడీ డీఎస్పీ వల్లే నల్గొండలో హత్యలు జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement