తండ్రి టీడీపీ నుంచి..కూతురు కాంగ్రెస్‌ నుంచి

Kishore Chandra Dev Going To Join In TDP  - Sakshi

కిశోర్‌ చంద్రదేవ్‌కు ఆదిలోనే ఇంటిపోరు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఎన్నికల్లో పోటీ చేయడం సంగతేమో కానీ టికెట్ల రేసులోనే  కేంద్ర మాజీ మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌కు ఇంటిపోరు మొదలైంది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కిశోర్‌ చంద్రదేవ్‌ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు మంగళవారం ఢిల్లీలో ప్రకటించారు. ధర్మపోరాట దీక్ష అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఆయన పార్టీలో చేరికపై, అరకు లోక్‌సభ నుంచి  పోటీ చేసే విషయమై చర్చించినట్టు చెప్పారు. వాస్తవానికి ఆయన కాంగ్రెస్‌ పార్టీని వీడినప్పటి నుంచి ఈ పరిణామం ఊహించిందే. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏమిటంటే ఆయన కుమార్తె శృతీదేవి సరిగ్గా రెండు రోజుల కిందటే అరకు లోక్‌సభ సీటు కేటాయించాల్సిందిగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి దరఖాస్తు చేసుకుంది.

ఈ మేరకు దరఖాస్తును సోమవారం విజయనగరం జిల్లా డీసీసీ కార్యాలయంలో అందించినట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్‌ వెల్లడించారు. పార్టీ టికెట్ల నిర్ణయం, పోటీ ఏమో గానీ... తండ్రి ‘సైకిల్‌’ ఎక్కేందుకు పోటీ పడుతుంటే కుమార్తె ‘హస్త’వాసిని నమ్ముకోవడం మాత్రం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇలావుండగా టీడీపీ అధిష్టానం అవకాశమిస్తే విశాఖ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తానని సినీనటుడు బాలకృష్ణ చిన్నల్లుడు, మాజీ ఎమ్మెల్యే గీతం మూర్తి మనుమడు, గీతం వర్సిటీ ప్రస్తుత అధ్యక్షుడు శ్రీభరత్‌ విశాఖలో తెలిపారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top