‘పాక్‌ను ఏకాకి చేయాలనే అమెరికాతో జట్టు’

Kishan Reddy Said India Team Up With America For Isolate pakistan - Sakshi

కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : ఢిల్లీలో హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న వారి వెనక ఎవరున్నా.. వారిపై చర్యలు తప్పవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ..- ఢిల్లీ ఘటన ఫెయిల్యూర్ కాదని.. ఢిల్లీ పూర్తిగా పోలీసుల కంట్రోల్ లోనే ఉందని తెలిపారు. కేసీఆర్ అండ చూసుకుని అసదుద్దీన్ రెచ్చిపోతున్నారని.. పులిమీద కేసీఆర్ స్వారీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లక్ష మంది అసదుద్దీన్లు అడ్డుపడినప్పటికీ సీఏఏను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. సీఏఏతో  దేశ ప్రజలకు నష్టం లేదని, కావాలనే దీనిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లేని అంశాలను జోడించి మతపరమైన విద్వేషాలు సృష్టిస్తున్నారని, దేశంలో ఒక పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

సీఏఏతో అక్షరం కూడా నష్టం లేదని, పాకిస్తాన్, బంగ్లాదేశ్ పంపుతారంటూ దిగజారుడు ప్రచారం చేస్తున్నారని కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని 130 కోట్ల భారతీయులలో ఏ ఒక్కరికైనా నష్టం కలుగుతోందని చూపించాలని రాజకీయ పార్టీలకు సవాల్‌ విసిరారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు కూడా ఈ చట్టం వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. మైనార్టీ ప్రజలు తప్పుడు ప్రచారం నమ్మవద్దని హితవు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో దేశ ప్రతిష్టను పెంచడానికి కృషి చేస్తున్నారని, ఆర్థిక శక్తిలో భారత దేశం అగ్ర భాగాన ఉండాలని మోదీ కష్ట పడుతున్నారని తెలిపారు. ప్రధాని విజయాలను జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.

పాకిస్థాన్‌ను ఏకాకి చేయాలనే భారత్ అమెరికాతో జట్టు కట్టిందని మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.  ట్రంప్ భారత పర్యటనలో ఉండగా ఢిల్లీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని విమర్శించారు. ఒక చేతితో జాతీయ జెండా పట్టుకుని మరో చేతితో రాళ్ళ దాడి చేస్తారా అని ప్రశ్నించారు. ఎవరు హింసకు పాల్పడినా సహించేది లేదని, సంఘ విద్రోహ శక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండు నెలలుగా ఉద్యమాలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం సంయమనం పాటిస్తుందన్నారు. ప్రశాంతమైన వాతావరణం దెబ్బతీసే విధంగా వ్యవహరించవద్దని,  రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని మంత్రి సూచించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top