తీసిపారేసినట్టు మాట్లాడిన చంద్రబాబు

KCR Comments in Karimnagar Meeting - Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనను చూసి భయపడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కరీంనగర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్‌తో ఏమీ కాదని మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రలో ఆయనను ఓడిస్తానని భయపడుతున్నాడని అన్నారు. మూడు నెలల్లో మూడు వేల సార్లు తనను తిట్టాడని తెలిపారు. 20 ఏళ్ల క్రితం తెలంగాణ తెస్తానని తాను చెబితే తీసిపారేసినట్టు మాట్లాడారని గుర్తు చేసుకున్నారు.

ఒకప్పుడు దారితెన్ను రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపామని, అన్ని రంగాల్లో తెలంగాణ మార్గదర్శకంగా నిలిచి ముందుకు పోతోందని కేసీఆర్‌ చెప్పారు. విద్యుత్‌ రంగంలో అద్భుతం చేశామని, దేశంలో తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ ముందుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆరు నెలల్లో పూర్తిచేస్తామని హామీయిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నాలుగు జీవధారలు వస్తాయన్నారు. పరిపాలన చేతకాదని ఎవరు అన్నారో వారి కంటే బాగా పనిచేస్తున్నామన్నారు.

మోదీ, రాహుల్‌కు సవాల్‌
జాతీయ పార్టీలతో ఎటువంటి ఉపయోగం లేదని కేసీఆర్‌ అన్నారు. దేశంలో అసలు జాతీయ పార్టీలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ‘16 ఎంపీలు గెలిస్తే ఏం చేస్తావని అడుగుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతాంగానికి 24 గంటలు కరెంట్‌ ఇచ్చే రాష్టం ఒక్కటైనా ఉందా అని నరేంద్ర మోదీ, రాహుల్‌ గాంధీని అడుగుతున్నా. దమ్ముంటే సమాధానం చెప్పాలి. కేంద్రం నిధులు ఇచ్చే విషయంలో అమిత్‌ షా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసలు దోషులు మోదీ, రాహులే. దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 40 వేల కోట్ల ఎకరాలు మాత్రమే వ్యవసాయ అనుకూల భూమి ఉంది. 40 వేల టీఎంసీల నీళ్లు సరిపోతాయి. దేశాన్ని కాంగ్రెస్‌ 50 ఏళ్లు పైబడి పాలించింది. బీజేపీ 11 ఏళ్లు పైబడి పాలించినా తాగు నీళ్లు లేవు. మీకు తెలివుంటే ఈ పరిస్థితి వచ్చేదా? 15 ఏళ్లు గడిచినా కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించలేకపోయారు. జీవనదుల నీళ్లన్నీ దేశాన్ని సస్యశ్యామలం చేయాల’ని కేసీఆర్‌ అన్నారు. ఈ దేశం బాగుపడాలంటే కేంద్రంలో సమాఖ్య ప్రభుత్వం రావాలన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top