మరో 20 ఏళ్లు కేసీఆరే సీఎం

KCR another 20 years Also CM - Sakshi

బషీరాబాద్‌(తాండూరు) : తెలంగాణ సీఎంగా మరో ఇరవై ఏళ్ల పాటు కేసీఆరే ఉంటారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులు అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రైతుబంధు పథకం కొనసాగుతుందని చెప్పారు. కలెక్టర్‌ ఉమర్‌ జలీల్‌తో కలిసి వికారాబాద్‌ జిల్లాలో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. నవల్గ, పర్వత్‌పల్లి, నావంద్గి గ్రామాల్లో లబ్ధిదారులకు చెక్కులు, పాసుపుస్తకాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని దుర్వినియోగం చేయొద్దని సూచించారు. ఏడాదికి రెండు సార్లు చెక్కుల పంపిణీ ఉంటుందని తెలిపారు. వచ్చే ఖరీఫ్‌ నుంచి రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులకు ప్రభుత్వమే జీవిత బీమా ప్రీమియం చెల్లిస్తుందని ప్రకటించారు. దీనిద్వారా అకాల మరణం పొందిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందుతుందని చెప్పారు. వ్యవసాయానికి అవసరమైన ప్రధాన వనరులు.. సాగునీరు, విద్యుత్తు, పెట్టుబడి సాయాన్ని సీఎం సమకూరుస్తారని చెప్పారు. కష్టపడి పనిచేసి పైకి రావాలని రైతులకు పిలుపునిచన్చారు. వ్యవసాయ రంగాన్ని దేశానికే ఆదర్శంగా చేయబోతున్నామని అన్నారు. నవల్గలో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మంత్రి ని ఎడ్ల బండిలో ఊరేగింపుగా తీసుకువచ్చారు.

అతిపెద్ద పథకం... 

కలెక్టర్‌ జలీల్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో రైతుబంధు అతి పెద్దదన్నారు. రైతులు సీఎంకు అండగా నిలువాలని సూచించారు. చెక్కులు వచ్చి పాసు పుస్తకాలు రాని రైతులు పాత పుస్తకాలపై తహసీల్దార్‌ సంతకం తీసుకొని బ్యాంకుకు వెళితే చెక్కులు డ్రా అవుతాయని వివరించారు. నవల్గ పర్యటనకు వచ్చిన మంత్రికి రైతులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. గ్రామ మాజీ సర్పంచ్‌ నర్సిములు, రైతు సమన్వయ సమితి సభ్యులు మంత్రిని ఎడ్లబండిపై సమావేశం వరకు తీసుకెళ్లారు.

కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కరణం పురుషోత్తంరావు, ఎంపీపీ కరుణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కళావతి, పీఎసీఎస్‌ చైర్మన్‌ అనంత్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, మండల ప్రత్యేక అధికారి జాకబ్, తహసీల్దార్‌ వెంకటయ్య, సర్పంచులు పల్లె వీరేశం, మాణిక్యమ్మ, జయమ్మ, ఎంపీటీసీ నరేష్‌ చౌహన్, జిల్లా రైతుసమితి సభ్యుడు అజయ్‌ప్రసాద్, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్‌రామ్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రాజు, పీఎసీఎస్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, నవల్గ మాజీ సర్పంచ్‌ డి.నర్సిములు, గ్రామ కోఆర్డినేటర్లు మాధవి, పద్మ, రవిప్రసాద్, టీఆర్‌ఎస్‌ కార్యదర్శి అబ్దుల్‌ రజాక్, యువజన నాయకులు రియాజ్, రెవెన్యూ సీనియర్‌ అసిస్టెంట్‌ రాజురెడ్డి, వీఆర్‌ఓలు రాఘవేందర్‌రెడ్డి, అనిల్, ఏఈ కృష్ణ, ఏఈఓ పవన్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top