కన్నడ సిత్రం: ఆయారాం, గయారాంలదే హవా!

Karnataka Assembly Elections Unstable Leaders Demand - Sakshi

ఆయారాం, గయారాంలదే అక్కడ హవా...!

కర్ణాటక కొత్త సర్కార్‌ ఏర్పాటులో  ‘ఆయారాం, గయారాం’లే కీలక భూమికను పోషించనున్నారు. గతంలో ఉత్తరాది రాష్ట్రాల్లో తరచుగా పార్టీలు మార్చే ఎమ్మెల్యేలను ఆయారాం, గయారాంలుగా పిలిచేవారు. అయితే  గత మూడు,నాలుగు దశాబ్దాల కాలంలో  తొలిసారిగా కన్నడ నాట ప్రధాన పార్టీల నుంచి పరస్పర ఫిరాయింపుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సారి ఎన్నికల్లో ఇలా మొత్తం 60 మందికి పైగా  బరిలో నిలవడంతో వారే నూతన ప్రభుత్వ స్థాపనను నిర్దేశించే స్థితిలో నిలుస్తున్నారు.

 బీజేపీ, జేడీ(ఎస్‌)ల నుంచి పార్టీ ఫిరాయించిన వారికి అధికార కాంగ్రెస్‌పార్టీ టికెట్లు ఇచ్చింది. ఇప్పుడు   వారిలో కొందరు ఎన్నికలకు కొన్ని నెలల ముందు పార్టీ మారగా, కొందరైతే నామినేషన్ల దాఖలుకు ఒకటి,రెండు రోజుల ముందే చేరినవారున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఈ విషయంలో తానేమి తక్కువ కాదంటూ ఏకంగా 20 మంది ఇతర పార్టీల వారికి కాషాయకండువాలు కప్పేసింది. వీరిలో కొందరిని నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాక కూడా చేర్చుకుంది.  

కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో 8 మంది జేడీ (ఎస్‌)ఎమ్మెల్యేలు, అయిదుగురు బీజేపీ నాయకులకు టికెట్లు ఇచ్చింది. బీజేపీ ఐదుగురు జేడీ(ఎస్‌), ఏడుగురు కాంగ్రెస్‌ నాయకులకు పార్టీ టికెట్లు ఇచ్చి పోటీకి అవకాశమిచ్చింది. హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో ప్రధానపాత్ర నిర్వహించాలని ఉవ్విళ్లూరుతున్న జేడీ (ఎస్‌) మొత్తం 22 పార్టీ ఫిరాయింపుదారులకు టికెట్టిచ్చింది. వారిలో 12 మంది కాంగ్రెస్‌కు, 10 మంది బీజేపీకి చెందినవారున్నారు. కొందరైతే నామినేషన్ల దాఖలు ముగియడానికి కేవలం ఒకటి, రెండు రోజుల ముందే ఆ పార్టీలో చేరారు. 

తాజా పరిణామాలతో మరింత అయోమయం...
ఎవరూ ఊహించని విధంగా నామినేషన్ల గడువు ముగిసే వరకు చోటుచేసుకున్న ఈ పరిణామాలతో అక్కడ రాజకీయ శ్రేణుల్లో సందిగ్ధత ఏర్పడింది. దీంతో ఓటర్ల మనోగతం ఏ విధంగా ఉండబోతున్నదని అంచనా వేయడం తలపండిన  రాజకీయ పండితులకు సైతం శక్తికి మించిన  పనిగా తయారైంది. ప్రధానపార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, వారు ఎవరిని గెలిపిస్తారనే దానిపై అయోమయం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్‌)లకు ఈ ఎన్నికలు చావోరేవో అన్నట్టుగా తయారవడంతో సిద్ధాంతాలు, విధానాలు వంటి వాటిని పెద్దగా పట్టించుకోకుండానే చివరి నిముషంలో పార్టీ మారే వారికి టికెట్లు ఇచ్చాయని విమర్శిస్తున్న వారూ ఉన్నారు. 
 

మచ్చుకు కొందరు...

  • వారం, పదిరోజుల క్రితం వరకు బీజేపీ ర్యాలీల నిర్వహణలో బిజీగా ఉన్న బీజాపుర జిల్లా బీజేపీ అధ్యక్షుడు విఠల్‌ కటకదొండ నాగథాన ఎస్సీ సీటు నుంచి సీటు నిరాకరణతో కాంగ్రెస్‌లో చేరి అక్కడి నుంచే అధికారపార్టీ అభ్యర్థి అయ్యాడు
  • గుల్బర్గాజిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఎంవై పాటిల్‌  కొన్నినెలల క్రితమే ఎన్నికల ప్రచారాన్ని సైతం మొదలుపెట్టినా ఆయన స్థానంలో కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మలికయ్య గుత్తేదార్‌కు బీజేపీ టికెట్‌ ఇవ్వడంతో పార్టీ పిరాయించి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేస్తున్నాడు. 
  • కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే బి.ప్రసన్నకుమార్‌ బెంగలూరులోని పులికేషినగర నుంచి టికెట్‌ ఆశించారు. అయితే సిట్టింగ్‌ జేడీ(ఎస్‌) ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తికి సిద్ధరామయ్య టికెట్‌ ఇవ్వడంతో ఆయన కూడా పార్టీ మారి అదే సీటు నుంచి జేడీ(ఎస్‌) టికెట్‌పై బరిలో నిలిచాడు.  
  • ప్రతీ ఓటు ఎంత కీలకమైనదో అంత కంటే ఎక్కువగా గెలిచే ప్రతీ సీటు ముఖ్యమైనదే. అందువల్ల విజయం సాధించే ‘ఆయారాం, గయారాం’లు తమకు గౌరవనీయులేనన్న  ఓ సీనియర్‌నేత మాటలు అక్కడున్న పరిస్థితులు ఎత్తిచూపుతున్నాయి.

–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top