బాబుది అబద్ధాల పాలన | Kakani Govardhan Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబుది అబద్ధాల పాలన

Sep 28 2018 1:41 PM | Updated on Oct 30 2018 6:08 PM

Kakani Govardhan Reddy Slams Chandrababu Naidu - Sakshi

ముత్తుకూరు సభలో ప్రసంగిస్తున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు, ముత్తుకూరు:  అబద్ధాల పుట్ట చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం దగ్గర పడిందని,  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, తాజా మాజీ ఎంపీ డాక్టర్‌ వరప్రసాద్‌రావు అన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 3,000 కిలో మీటర్ల మైలురాయిని అధిగమించిన సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి తలపెట్టిన మూడు రోజుల పాదయాత్ర గురువారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా ముత్తుకూరులో జరిగిన భారీ బహిరంగ సభలో కాకాణి ప్రసంగించారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. ఇంటికో ఉద్యోగం, రైతులు, డ్వాక్రా సంఘాల రుణమాఫీలు, పక్కాగృహాల హామీలన్నీ మోసపూరితమైనవని ప్రజలు గ్రహించారన్నారు. జన్మభూమి కమిటీలతో పేదలను దోచుకున్నారన్నారు. అన్ని వర్గాలను నిలువునా ముంచాడన్నారు. తాత్కాలిక సచివాలయాల నుంచి పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వరకు అవినీతి వరదలై పారుతోందన్నారు. ధర్మరాబాద్‌ కోర్టు ఇచ్చిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను సైతం రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సిగ్గుచేటు అన్నారు. జగన్‌ పాలనరాగానే మత్స్యకారేతర ప్యాకేజీ పంపిణీ, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం,  స్థానికులకు ఉద్యోగాలు కల్పన తదితర కార్యక్రమాలు చేపట్టడం తన బాధ్యత అన్నారు.

రమణదీక్షితుల్ని తిట్టింది మరిచారా..
సంస్కారవంతంగా మాట్లాడాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కాకాణి ఎద్దేవా చేశారు. టీటీడీ ప్రధాన అర్చకులైన రమణదీక్షితుల్ని ఏ స్థాయిలో తూలనాడావో ప్రజలు మరిచిపోలేదన్నారు. నాలుగు సార్లు పరాజయం అయిన నిన్ను వైఎస్‌ జగన్‌ను తిట్టేందుకే చంద్రబాబు మంత్రిని చేసిన విషయం కూడా జనానికి గుర్తుందన్నారు. నీరు–చెట్టు పథకం నిధులు మీ ఇంట్లో ఏరులై పారుతోందన్నారు. నిరంతరం గ్రావెల్‌ దోపిడీకి పాల్పడుతూ, నీతులు చెప్పడం సిగ్గు చేటు అన్నారు.

ఒంటిరిగా పోటీ చేసే దమ్ములేదు
చంద్రబాబుకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేదని తాజా మాజీ ఎంపీ వీ వరప్రసాద్‌రావు ఎద్దేవా చేశారు. అబద్ధాల పునాదులపై రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పాలనలో లోపాలు ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షాలమైన తమపై ఉందన్నారు. ఎన్నికలు సమీపించడంతో నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్లు అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు త్వరలో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. మండల కన్వీనర్‌ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు శివప్రసాద్, మందల వెంకటశేషయ్య, చిరంజీవులుగౌడ్, నియోజకవర్గ నాయకులు దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి, గోగిరెడ్డి గోపాలరెడ్డి, కనుపూరు కోదండరామిరెడ్డి, శంకరయ్య గౌడ్, దాసరి భాస్కర్‌గౌడ్, రామిరెడ్డి, కావలి అనీల్, ఎంపీపీ కోన బ్రహ్మయ్య, ఎం జనార్దన్‌రెడ్డి, కే లక్ష్మణరెడ్డి ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement